NTV Telugu Site icon

Air India: ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. రూ.90 లక్షలు ఫైన్.. దేనికోసమంటే..!

Airindia

Airindia

అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్‌ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. దీంతో పాటు ఎయిర్‌ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్‌ డైరెక్టర్‌కు రూ.3 లక్షలు ఫైన్ విధించింది. ఈ లోపాలపై సంస్థ ఇచ్చిన స్వచ్ఛంద నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్‌ను హెచ్చరించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Modi-Zelenskyy: యుద్ధ పీడిత ఉక్రెయిన్‌ ప్రధాని జెలెన్స్‌కీ భుజం తట్టిన మోడీ.. భావోద్వేగం(వీడియో)

జులై 9వ తేదీన ఎయిర్‌ఇండియా ముంబై నుంచి రియాద్‌కు ఓ విమానం నడిపింది. ఆ విమానంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి ట్రైనీ పైలట్‌ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ట్రైనింగ్‌ కెప్టెన్‌ అనారోగ్యానికి గురికావడంతో రోస్టరింగ్ విధానంలో నార్మల్‌ లైన్‌ కెప్టెన్‌ విధుల్లోకి వెళ్లారు. ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇచ్చే అర్హత ఈ కెప్టెన్‌కు లేదు. సిబ్బంది నిర్వహణ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ట్రైనీ పైలట్‌, కెప్టెన్‌ స్వచ్ఛందంగా బేస్‌ మేనేజర్‌కు రిపోర్ట్‌ చేశారు. అనంతరం ఎయిర్‌లైన్‌ దీనిపై డీజీసీఏకు వాలంటరీగా నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏవియేషన్‌ రెగ్యులేటరీ.. ఎయిర్‌ఇండియాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇది తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించిన డీసీజీఏ సంస్థకు జరిమానా విధించింది. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పైలట్లను హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!