ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్‌కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అయిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
AI 887 విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం తెల్లవారుజామున 3:20 గంటలకు ముంబైకు బయల్దేరింది. అయితే విమానం గాల్లోకి ఎగరగానే పైలట్లు కుడివైపు ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పడిపోయినట్లుగా గమినించారు. వెంటనే అప్రమత్తమై విమానాన్ని కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులంతా క్షేమంగా దిగేశారని.. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఇంజిన్‌లో తలెత్తిన వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లుగా భావిస్తున్నారు. ఇక అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఊహించని రీతిలో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. అయితే దీనిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిరిండియాకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని డీజీసీఏకు సూచించింది. అలాగే ప్రయాణికులకు అన్ని విధాలా సహాయం అందించాలని.. తదుపరి విమానాల్లో సర్దుబాటు చేయాలని తెలిపింది.
