హర్యానాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. అచేతన స్థితిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై ఆస్పత్రి సిబ్బందిలో ఒకరు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఐసీయూలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్.. కంపెనీ స్పాన్సర్ చేసిన శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వెళ్లి ఒక హోటల్‌లో బస చేసింది. స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతూ నీటిలో మునిగిపోయింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్రమత్తమైన సిబ్బంది రక్షించి.. ప్రాథమిక చికిత్స తర్వాత ఏప్రిల్ 5న గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఆమెకు చికిత్స జరుగుతోంది. ఏప్రిల్ 6న ఆస్పత్రి సిబ్బందిలో ఒకరు.. అదే అదునుగా భావించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె మాటలాడలేని స్థితిలో.. అరవలేని స్థితిలో ఉండి పోయింది. పూర్తిగా ఆమె వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్చర్యమేంటంటే అదే సమయంలో సమీపంలో ఇద్దరు నర్సులు ఉన్న కూడా స్పందించకపోవడం మరింత బాధాకరం.
ఇక ఏప్రిల్ 13న ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమెను తీసుకెళ్లేందుకు భర్త వచ్చాడు. ఆ సమయంలో జరిగిన ఘోరాన్ని భర్తకు తెలియజేసింది. వెంటనే అతడు అత్యవసర హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం ఇప్పి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.