Gujarat: గుజరాత్ అహ్మదాబాద్‌కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. తప్పుడు వయసు చెప్పి తనకు ఆ మహిళని అంటగట్టారని సర్ఖేజ్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. అయితే, పెళ్లై ఏడాది గడుస్తున్నా తమకు పిల్లలు పుట్టడం లేదని తన భార్యను తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లిన సమయంలో భర్తకు తన భార్య వయసును దాచిన సంగతి తెలిసింది.
పెళ్లి సమయంలో సదరు మహిళకు 32 ఏళ్లని చెప్పారని, విచారణలో మాత్రం 40 ఏళ్లకు పైగా ఉంటుందని డాక్టర్ చెప్పినట్లు సదరు వ్యక్తి చెప్పారు. ఈ జంట సహజంగా గర్భం దాల్చే అవకాశం లేదని సోనోగ్రఫీ నివేదిక ద్వారా వైద్యులు నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన వ్యక్తి వేజల్‌పూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. భార్యతో పాటు ఆమె తండ్రి, బంధువులపై కేసు పెట్టాడు. నమ్మకాన్ని ఉల్లంఘించడం, ఫోర్జరీ చేయడం, మోసం చేయడం, నేరపూరిత కుట్ర మరియు బెదిరింపులకు సంబంధించిన IPCలోని బహుళ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Read Also: Delhi Court: వ్యక్తిపై నకిలీ అత్యాచార కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఏం చెప్పిదంటే..?
‘‘తన భార్య బయోడెటాలో ఆమె పుట్టిన తేదీ మే 18, 1991 అని చూపబడింది, ఆమె నా కంటే 18 నెలలు చిన్నది. ఆమె కుటుంబాన్ని కలుసుకున్న తర్వాత, మా వివాహం జూన్ 19, 2023కి నిర్ణయించబడింది. అమ్మాయి కుటుంబం పాలన్‌పూర్‌లోని ఒక గ్రామంలో వివాహం జరపాలని అభ్యర్థించారు’’ అని ఎఫ్ఐఆర్‌లో వ్యక్తి పేర్కొన్నాడు. తాను పదేపదే తన భార్య వయసు, విద్యార్హత రుజువులు చూపించాలని కోరినప్పటికీ, ఆమె కుటుంబం దాటవేసేదని చెప్పారు. పెళ్లి రోజు ఆమె స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ కాపీని చూపించారని, వివాహ రిజిస్ట్రేషన్‌లో తన భార్య పుట్టిన రోజు మే 18, 1991గా చెప్పినట్లు పోలీసులకు వెల్లడించారు.
గర్భం దాల్చకపోవడంతో తన అత్త, మరదలు తన భార్యను జుహాపురాలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారని, అయితే దానికి సంబంధించిన రిపోర్టులు తనకు చూపించలేదని సదరు వ్యక్తి చెప్పారు. సెప్టెంబరు 2023లో, తాము పాల్డిలోని గైనకాలజిస్ట్‌ని సంప్రదించామని, డాక్టర్ ప్రకారం తన భార్యకు 40 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు సోనోగ్రఫీ నివేదిక సూచించిందని, ఆమె సహజంగా గర్భం దాల్చదని అతను చెప్పాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు. పెళ్లి అయిన తర్వాత బ్యాంకింగ్ ప్రయోజనాల కోసం వివాహాన్ని నమోదు చేయమని నేను అడిగినప్పుడల్లా నా భార్య ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా తప్పించుకుందని చెప్పాడు. ఆమె సోదరులు ఆమే డేట్ ఆఫ్ బర్త్‌ని మే 18, 1985 నుండి మే 18, 1991కి మార్చారని ఆరోపించాడు.