అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి మూడు నెలలు గడిచింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెలువడలేదు. ఆ మధ్య కాలంలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదలైంది. అయితే ఈ నివేదిక తీవ్ర దుమారం రేపింది. పైలట్ ఆత్మహత్య వల్లే విమాన ప్రమాదం జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తుది నివేదిక రాకుండా ఎలా ఏకపక్షంగా కథనాలు ప్రచారం చేస్తారంటూ ధ్వజమెత్తాయి. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నివేదిక తర్వాత బాధిత కుటుంబాల్లో కూడా ఒక విధమైన ఆందోళన కూడా మొదలైంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం 30 ఏళ్లలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం. ఒక్కరు మినహా విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హాస్టల్ బిల్డింగ్‌పై కూలడంతో మెడికోలు కూడా మరణించారు. అయితే ప్రమాదం తర్వాత 3 నెలల్లో కారణాలు విశ్లేషించి నివేదిక ఇవ్వాలని భద్రతా ప్యానెల్‌కు ఆదేశించబడింది. ఈ గడువు శుక్రవారంతో ముగిసింది. కానీ ఎటువంటి నివేదికను సమర్పించలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు జాతీయ మీడియాకు తెలియజేశారు.
ఇంకోవైపు ఏఏఐబీ కూడా దర్యాప్తు చేస్తోంది. కానీ ప్రభుత్వం భద్రతా ప్రమాణాల కోసం ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు మూడు నెలల గడువు ఇచ్చింది. ఆ గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే ఆ మధ్య కాలంలో ఏఏఐబీ 15 పేజీల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఫ్యూయల్ స్విచ్‌లు ఆగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంది. అయితే తుది నివేదిక పూర్తి కావడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పట్టవచ్చని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల సూచించారు.
ప్రాథమిక నివేదిక..
ప్రాథమిక నివేదికలో టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. రెండు ఇంజిన్ ఇంధన స్విచ్‌లు ఆపివేయబడ్డాయని తెలిపింది. 15 పేజీల ప్రాథమిక నివేదికలో సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సూచించింది. అయితే ప్రమాదం జరిగిన విమానంలో ఇంధన స్విచ్‌లను ఎయిరిండియా రెండు సార్లు మార్చినట్లు సమాచారం. అంటే రెండు స్విచ్‌లు కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయని తెలిపింది. అయితే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొక పైలట్‌ను ‘‘నువ్వు ఎందుకు కట్ చేశావు?’’ అని అడుగుతున్నట్లు రికార్డైంది. మరొక పైలట్ ‘‘నేను చేయలేదు’’ అని ప్రతి స్పందించినట్లు తెలుస్తోంది. అంటే పైలట్ల మధ్య ఏదో గందరగోళం నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్య చర్యతో రెండు ఇంధన స్విచ్‌లు ఆపేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఖండన..
కథనాలపై పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రాథమిక నివేదిక రాకుండానే ఎలా కథనాలు ప్రసారం చేస్తారంటూ నిలదీశాయి. తుది నివేదిక వచ్చాక అప్పుడు అంగీకరిస్తామని పైలట్ సంఘాలు పేర్కొన్నాయి. అప్పుటి వరకు ఎలాంటి తప్పుడు కథనాలు ప్రచురించొద్దని.. ప్రజలను గందరగోళానికి నెట్టొద్దని కోరాయి. ఇదిలా ఉంటే ప్రాథమిక నివేదికను వైట్‌సైట్‌లో ఉంచారు. కానీ దానిపై ఎవరూ సంతకం చేయలేదు.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.