Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు సాయంత్రం భారత్‌లో తన రెండు రోజుల పర్యటన కోసం అడుగుపెట్టనున్నారు. పుతిన్ పర్యటనకు ముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం విదేశీ నాయకులను, ప్రతిపక్ష నేతల్ని కలవనీయకుండా నిరుత్సాహపరుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ‘‘అభద్రత’’ భావం వల్లే వారు చాలా కాలంగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని వదులుకుంటున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఏ విదేశీ నాయకుడైనా ప్రతిపక్ష నాయకుడితో సమావేశం కావడం ఒక సంప్రదాయమని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Techie Suicide: “ఇళ్లు కూడా కట్టుకోనివ్వరా”.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
‘‘గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల కాలంలో ఇది జరిగింది. ఇది ఒక సంప్రదాయం. కానీ ఈ రోజుల్లో విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు, నేను విదేశాలకు వెళ్లినప్పుడు కూడా విదేశీ నాయకులు ప్రతిపక్ష నేతను కలవకూడదని ప్రభుత్వం సూచిస్తోంది. ఇది వారి విధానం, వారు ఎల్లప్పుడు ఇదే చేస్తున్నారు’’ అని ఆరోపించారు. తాము కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని, ప్రభుత్వం మాత్రమే దీనిని చేయదని, విదేశీ ప్రముఖులు ప్రతిపక్షాన్ని కలవడం ప్రభుత్వానికి ఇష్టంలేదని, మోడీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నియమాన్ని పాటించడం లేదని, ఇది వారి అభద్రతను సూచిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ హర్ష్ వర్ధన్ ష్రింగ్లా స్పందించారు. విదేశీ అతిథులకు చాలా టైట్ షెడ్యూల్ ఉంటుందని, ప్రతిపక్ష నేతలను కలవాలనే ప్రోటకాల్ ఏం లేదని చెప్పారు. ఏ విదేశీ అతిథి అయినా దేశాధినేతల్ని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని కలుస్తారని, ఇది సమయం, వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు వస్తున్నారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.