Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాదిలో ఆరుసార్లు కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు.
Read Also: Pawan Kalyan: రెండుచోట్ల ఓడిపోయినా.. నన్ను నడిపించింది మీరే
ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఈ నెల 20న కాంగ్రెస్ ఎంపీ, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించనున్నారు. మార్చి 20న కర్ణాటకలోని బెల్గామ్ లో పర్యటించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో యువత మ్యానిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారు. కాంగ్రెస్ తన ఎన్నికల హామీలను ప్రకటించే అవకాశం ఉంది. మే నెలలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 17న ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సోమవారం తెలిపారు. కర్ణాటకలో 224 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 150 సీట్లు సాధించి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.