Agniveers: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ వైమానిక ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయింది. మొత్తం 11 పాక్ ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. దీనికి తోడు పాకిస్తాన్, పీఓకే లోని లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, ట్రైనింగ్ కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమయ్యారు.
ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ ఇంత విజయవంతం కావడంతో ‘‘అగ్నివీరుల’’ కృషి ఉందని రక్షణ వర్గాలు ప్రశంసించాయి. సుమారుగా 3000 మంది అగ్నివీరులు గన్నర్లు, ఆపరేటర్లు, భారీ వాహన డ్రైవర్లుగా తమ సేవల్ని అందించారని, వీరి పనితీరు సాధారణ సైనికులతో సమానంగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. వీరందరి వయసు 20 ఏళ్ల లోపే కావడం గమనార్హం. వీరందర్ని అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యం రిక్రూట్ చేసుకుంది.
పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి భారత సైనిక స్థావరాలను రక్షించారు. కీలకమైన వాయు రక్షణ వ్యవస్థను నిర్వహించడం నుంచి పదే పదే శత్రువు దాడి చేస్తున్నప్పటికీ అనేక స్థావరాలను, నగరాలను కాపాడుకోవడంలో అగ్నివీరులు అత్యున్నత ప్రతిభను కనబరిచారు. ప్రతీ వైమానిక రక్షణ యూనిట్‌లో 150-200 మంది అగ్నివీరులు ఉన్నారని, ప్రధానంగా పశ్చిమ సరిహద్దుల్లో మోహరించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
అగ్నివీరులు ముఖ్యంగా నాలుగు విభాగాల్లో పనిచేశారు. గన్నర్లుగా, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లుగా, రేడియో ఆపరేటర్లుగా, గన్స్-క్షిపణులు అమర్చిన హెవీ డ్యూటీ వాహనాలకు డ్రైవర్లుగా పనిచేశారు. భారత తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్‌తీర్ యాక్టివేట్ చేయడానికి, ఆపరేటర్ చేయడానికి సహాయం చేశారు.
భుజం నుంచి ప్రయోగించే క్షిపణులను, L-70, Zu-23-2B వంటి అప్‌గ్రేడ్ చేసిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లను నిర్వహించడం, పెచోరా, షిల్కా, OSA-AK, స్ట్రెలా ,తుంగుస్కా వంటి మ్యానింగ్ సిస్టమ్‌లు, ఆకాష్ మిస్సైల్ సిస్టమ్, ఇతర ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణులను మోహరించడం, ప్రయోగించడంలో చురుకుగా పాల్గొన్నారు. రన్నింగ్ రాడార్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, ఆకాష్‌టీర్ నోడ్‌లు, కొన్ని ఆయుధ వ్యవస్థలను మోహరించిన తర్వాత ఫార్వర్డ్ జోన్‌లలో సెంట్రీలుగా కూడా వ్యవహరించాయి.
అగ్నివీర్ పథకం:
నాలుగు ఏళ్ల సేవల కోసం సైన్యంలో యువకులను రిక్రూట్ చేసుకునేందు కేంద్రం ‘‘అగ్నివీర్’’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వారిలో 25% మందిని మరో 15 సంవత్సరాలు రెగ్యులర్ చేస్తారు. వీరు 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల మధ్య యువత అగ్ని పథ్ స్కీమ్‌కి అర్హులు. అగ్నివీర్‌లు సర్వీస్‌లో మొదటి సంవత్సరంలో రూ.4.76 లక్షల వార్షిక జీతం, నాలుగో ఏడాదిలో రూ. 6.92 లక్షలు పొందుతారు, రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా కవర్, సర్వీస్ కారణంగా మరణిస్తే రూ.44 లక్షల అదనపు ఎక్స్‌గ్రేషియా పొందుతారు.
సాధారణ సైనికుల మాదిరిగా, నాలుగు సంవత్సరాల తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చిన వారికి పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, క్యాంటీన్ వంటి ప్రయోజనాలు లభించవు. అగ్నివీరులు నాలుగేళ్ల సర్వీసు తర్వాత కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో ప్రభుత్వం 10 శాతం ఖాళీలను రిజర్వ్ చేసింది. హర్యానా, రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమ పోలీసు దళాలలో అగ్నివీర్లకు రిజర్వేషన్లు ప్రకటించాయి.