NTV Telugu Site icon

AAP: ఆప్ సంచలన ప్రకటన.. ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడి

Priyankakakkar

Priyankakakkar

హర్యానా ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ హస్తం పార్టీ మాత్రం.. రెండు, మూడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగింది. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి.

ఇది కూడా చదవండి: Congress: ‘‘ఈవీఎంలు హ్యాక్ చేశారు’’..హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలనం..

రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం ప్రకటించారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఆప్‌కు ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అతి విశ్వాసం వల్లే హర్యానాలో చుక్కెదురైందని పేర్కొన్నారు. భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పట్టించుకోలేదని, వారికి అతివిశ్వాసం మితిమీరడంతోనే చివరకు ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆరోపించింది. ఢిల్లీలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు గెలవని కాంగ్రెస్‌కు ఇటీవల లోక్‌సభలో మూడు సీట్లు ఇచ్చామని.. అయినప్పటికీ హర్యానా ఎన్నికల్లో మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదని ఆప్‌ విమర్శించింది. హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని మండిపడింది.

ఇది కూడా చదవండి: Women’s T20 World Cup: శ్రీలంకతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..