కొందరి జీవితాల్లో కొన్ని తీరని కోరికలు ఉంటాయి.. అవి కొన్నిసందర్భాల్లో తీర్చుకునే అవకాశం వచ్చినా.. వెనుకడుగు వేసేవారు కూడా ఉంటారు.. అయితే, కొందరి ఒత్తిడియే.. లేక ప్రేమనో.. వారి ఆశలను నెరవేరిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.. ఓ వృద్ధ దంపతుల కోరిక కూడా అలా తీరింది.. 40 ఏళ్ల క్రితం వారు ఒక్కటైనా.. కూతురు పుట్టినా.. ఆమెకు పెళ్లి చేసిన తర్వాత.. అంటే దాదాపు 60 ఏళ్ల వయస్సులో వారికి పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ వృద్ధ జంట పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వడ్లిపడా ప్రాంతానికి చెందిన బాబు, తలైపడా ప్రాంతానికి చెందిన కంటా.. 40 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు.. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి.. వారిని ఒప్పించి పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ, వారి ప్రేమకు కులం అడ్డుగోడగా నిలిచింది.. పెద్దలు అంగీకరించకపోవడంతో.. వారిని ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సీమా అనే అమ్మాయి పుట్టింది.. ఆమెను పెంచి పెద్దచేసి.. ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు.. అయితే.. పెళ్లి చేసుకుని 40 ఏళ్లు గడిచినా తమ పెళ్లి సంప్రదాయబద్దంగా జరగలేదని బాధ మాత్రం బాబు, కంటా మదిని ఎప్పుడూ తొలచివేసేది.. వాళ్ల బాధను గుర్తించిన కూతురు, అల్లుడు.. లేటు వయసు అయినా వారిద్దరికీ సంప్రదాయబద్దంగా పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు.. దాదాపు వంద మంది అతిథుల సమక్షంలో ఈ వృద్ధ దంపతులకు సంప్రదాయబద్దంగా వివాహం చేశారు.. 40 ఏళ్ల క్రితం వారి పెళ్లి జరిగినా.. మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. విశేషం ఏంటంటే.. గతంలో వారి ప్రేమను, పెళ్లిని అంగీకరించని వారి కుటుంబ సభ్యులు కూడా హాజరై.. వారిని ఆశీర్వదించారు.