NTV Telugu Site icon

Sengol: రాజదండాన్ని ప్రధాని మోడీకి అందించిన ఆధీనం పూజారులు

Sengol

Sengol

Sengol: కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ పోడియం ముందు ప్రతిష్టించబోయే రాజదండాన్ని(సెంగోల్)ని ఆధీనం పూజారులు శనివారం ప్రధాని నరేంద్రమోడీకి అందచేశారు. ఈ రోజు చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరిని తమిళ వేదపండితులు ప్రధాని మోడీకి ఈ దండాన్ని అందించారు. శనివారం సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్న వేద పండితులు ఆయన్ని ఆశ్వీర్వదించారు. రేపు ఉదయం 8.30-9.00 గంటల మధ్య పార్లమెంట్ లోక్ సభ ఛాంబర్ లో సెంగోల్ ను ఏర్పాటు చేస్తారు.

Read Also: Bandi Sanjay: 5 నెలల్లో ఎన్నికలు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్ బాటన్ నుంచి అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ ఈ రాజదండాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఈ రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు. సెంగోల్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని రేపింది. బ్రిటీష్ వారు సెంగోల్ ను అధికారిక మార్పిడికి గుర్తుగా అభివర్ణించినట్లు ఎటువంటి డాక్యుమెంట్ ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే సెంగోల్ పై కాంగ్రెస్ వాదనలు తప్పని తమిళనాడు మఠాధిపతులు ఖండించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలు మరియు సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్‌ను అందించింది, కానీ దానిని ‘వాకింగ్ స్టిక్’గా మ్యూజియంలో ఉంచారు’’ అంటూ అమిత్ షా కాంగ్రెస్ పై మండిపడ్డారు.

ఆదివారం అట్టహాసంగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త భవనం ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రపతిని కాదని ప్రధాని ప్రారంభం చేయడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ తో సహా టీఎంసీ, ఆప్, ఎన్సీపీ వంటి 20 విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 25 పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి.