Adani bribery case: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలుపుతూ న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది. అదానీ కేసుల్లో యూఎస్ వర్సెస్ అదానీ(అదానీపై క్రిమనల్ కేసు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) vs అదానీ( అదానీపై సివిల్ కేసు), ఇతరులపై ఉన్న సివిల్ కేసులను కలిపి జాయింట్ క్రిమినల్, సివిల్ విచారణ చేయాలని అమెరికా కోర్టు ఆదేశించింది.
Read Also: Shankar: హాలీవుడ్ ఇండియన్ సినిమా వైపు చూస్తోంది.. శంకర్ కీలక వ్యాఖ్యలు
న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, షెడ్యూల్స్‌కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. అదానీపై క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న జిల్లా జడ్జ్ నికోలస్ జి గరౌఫీస్‌కి అన్ని కేసులు అప్పగించనున్నారు. కేసుల పునర్విభజన చేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించింది.
అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం, మోసానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్టీ, SECIతో 12 GW సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగపత్రంలో ఆరోపించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 265 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 2,029 కోట్లు) లంచంగా ఇచ్చారని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా అదానీ గ్రూప్ కొట్టిపారేసింది.