తమిళనాడులో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ లాకప్‌డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. అత్యంత దారుణంగా పోలీసులు చితకబాదడంతో దెబ్బలు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఇక మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకోని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పౌరుడిని పొట్టనపెట్టుకుందని ధ్వజమెత్తింది. అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్.. బాధిత కుటుంబానికి ఫోన్ చేసి సారీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: Chhangur Baba: హిందూ అమ్మాయిలను వలలో వేయడానికి 1000 మంది ముస్లిం యువకులకు నిధులు..
తాజాగా ఇదే అంశంపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్‌కు నిరసనగా చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయ్ నల్ల చొక్కా ధరించి.. ‘సారీ కాదు, మాకు న్యాయం కావాలి’ అంటూ ప్లకార్డును పట్టుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి అతి పెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోందని.. అన్నా యునివర్సిటీలో జరిగిన అత్యాచార కేసు దగ్గర నుంచి అజిత్ కుమార్ కేసు వరకు.. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి? అని ప్రశ్నించారు. న్యాయస్థానాలే జోక్యం చేసుకుని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయంటూ విజయ్ పేర్కొన్నారు. డీఎంకే హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారని.. వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని.. అజిత్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: MG: ఎంజి కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా లక్షల్లో.. లేట్ చేయకండి
ఇటీవల శివగంగై జిల్లాలో ఒక ఆలయం దగ్గర దొంగతనం జరిగిందన్న ఫిర్యాదుతో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కస్టడీలో చితకబాదడంతో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయాడు. పోస్ట్‌మార్టం రిపోర్టులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 44 చోట్ల గాయాలున్నాయని.. అంతర్గత గాయాలు కారణంగానే అజిత్ కుమార్ చనిపోయినట్లుగా నివేదిక పేర్కొంది. ఇక అజిత్ కుమార్‌ను కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.