కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా రన్యారావుతో తెలుగు నటుడు తరుణ్ రాజుకు ఉన్న సంబంధాల గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఇరువర్గాల వాదనల్లో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
రన్యారావుతో తరుణ్ రాజుకు దశాబ్ద కాలం నుంచి పరిచయం ఉందని.. ఇటీవల కాలంలో ఇద్దరూ కలిసి 25 సార్లు దుబాయ్ పర్యటనకు వెళ్లినట్లు న్యాయస్థానానికి డీఆర్ఐ అధికారులు తెలిపారు. మార్చి 3న ఉదయం 4 గంటలకు దుబాయ్ వెళ్లిన రన్యారావు, తరుణ్ రాజు.. అదే రోజు సాయంత్రం 6:20 గంటలకు తిరిగి ఇండియాకు వచ్చారని పేర్కొన్నారు. రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగగా.. తరుణ్ రాజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగినట్లుగా పేర్కొన్నారు.
ఇక రన్యారావు అరెస్ట్ కాగానే.. తరుణ్ రాజు దేశం విడిచి అమెరికా పారిపోయేందుకు ప్రయత్నించాడని.. పుట్టుకతో తరుణ్ రాజు అమెరికా వాసి అని వెల్లడించారు. అతడికి యూఎస్ పాస్‌పోర్టు ఉందని తెలిపారు. కానీ అప్పటికే తాము లుకౌట్ నోటీసు జారీ చేశామని… ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అతన్ని అధికారులు అడ్డగించారన్నారు. అయితే మార్చి 8న తరుణ్ రాజుకు సమన్లు జారీ చేయగా.. మార్చి 9న అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. తరుణ్ రాజుకి దుబాయ్‌లో బంగారం వ్యాపారులు ఉన్నాయని.. ఇందులో భాగంగానే రన్యారావుతో స్మగ్లింగ్ చేయిపించినట్లుగా న్యాయస్థానానికి డీఆర్ఐ న్యాయవాది చెప్పుకొచ్చారు. ఇక రన్యారావు-తరుణ్ రాజు కలిసే ఉంటున్నారని తెలిపారు.
ఇక రన్యారావు సవితి తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ అధికారి కావడం.. అంతేకాకుండా హోంమంత్రి పరమేశ్వరతో సంబంధాలు ఉండడంతో ఆ పరపతిని ఉపయోగించుకుని సులువుగా రన్యారావు వీఐపీ ప్రొటోకాల్ మీద ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. మార్చి 3న ఇద్దరూ దుబాయ్ విమానాశ్రయంలో అడుగుపెట్టారని.. తరుణ్ రాజు జెనీవాకు ప్రయాణిస్తున్నట్లు చెప్పి.. బంగారాన్ని రన్యారావుకు అప్పగించాడని.. కానీ జెనీవాకు బదులుగా తరుణ్ రాజు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలిపారు. మరొక విమానంలో రన్యారావు బెంగళూరుకు వచ్చిందని వివరించారు. వేర్వేరుగా ప్రయాణం చేయడం వల్ల రన్యారావుతో పాటు తరుణ్ రాజును అరెస్ట్ చేయలేకపోయనట్లు చెప్పారు. రన్యారావు మొబైల్, ల్యాప్‌ట్యాప్ పరిశీలించాకే.. తరుణ్ రాజు బండారం బయటపడిందని పేర్కొన్నారు. రన్యారావుకు స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించింది తరుణ్ రాజే అని తెలిపారు.
ఇదిలా ఉంటే డీఆర్ఐ అధికారుల వాదనను తరుణ్ రాజు న్యాయవాది ఎంఎం.దేవరాజా కొట్టిపారేశారు. తరుణ్ రాజు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. అయినా రన్యారావు వాంగ్మూలంలో అసలు తరుణ్ రాజు పేరే లేదని.. సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని వాదించారు. డీఆర్ఐ అధికారులు సమన్లు అందించగానే తరుణ్ రాజు పూర్తిగా సహకరించారని తెలిపారు. ప్రాథమికంగా కేసు నమోదు కాలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు.
పుట్టుకతో తరుణ్ రాజు అమెరికా పౌరుడు. తండ్రి మరణం తర్వాత తరుణ్ రాజు కుటుంబం తిరిగి భారత్‌కు వచ్చేసింది. తరుణ్ రాజుకి భారత పౌరసత్వం కూడా ఉంది. ఇక రన్యారావుకి యూఏఇ నివాసి గుర్తింపు కార్డు ఉంది. ఇక మార్చి 14న రన్యారావు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. జనవరి నుంచి మార్చి 3 వరకు 27 సార్లు రన్యారావు దుబాయ్ ప్రయాణం చేసింది. మార్చి 3న రూ.12.56 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడింది. అనంతరం ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌లో చాలా చురుకైన పాత్ర పోషించిందని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
ఇక రన్యారావు, తరుణ్ రాజు సినీ కెరీర్ అంతగా మెరిసిపోలేదు. 2014లో కన్నడ చిత్రం మాణిక్యలో కథనాయికగా రన్యారావు అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 3 చిత్రాల్లో నటించింది. కానీ అంత పేరు సంపాదించలేదు. ఇక తరుణ్ రాజు 2018లో పరిచయం చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. కానీ అది పెద్దగా విజయం సాధించలేదు. ఇక వీళ్లిద్దరూ సినీ కెరీర్‌కి స్వస్తి చెప్పి.. ఇలా స్మగ్లింగ్ బిజినెస్‌లోకి దిగి కటకటాల పాలయ్యారు.
రన్యారావు నాలుగు నెలల క్రితం ఆర్కిటెక్ జతిన్ హుక్కేరిని వివాహం చేసుకుంది. కానీ అతడితో సంసారం చేయలేనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని భర్త జతిన్ హుక్కేరి న్యాయస్థానానికి తెలియజేశాడు. నెల రోజులకే దూరంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే విడాకులు తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇక రన్యారావు తండ్రి ఐపీఎస్ అధికారి. కుమార్తెకు పెళ్లి చేశాక.. ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవని డీఆర్ఐ విచారణలో రామచంద్రరావు తెలిపారు.