దేశవ్యాప్తంగా సంచలనం రేపిన.. లఖింపూర్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు… ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంకా తెలియలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత కొరవడింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులకూ ఆశిష్ స్పందించలేదు. ఇవాళ ఉదయం పదింటికి.. క్రైం బ్రాంచ్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అతను రాకపోవడంతో ఎక్కడున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఆశిష్ మిత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయం.. ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఒకట్రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అయితే, అతను భారత్, నేపాల్ సరిహద్దులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులకూ సమాచారం అందినట్టు తెలిసింది. నేపాల్ సరిహద్దులోని గౌరీ ఫాంటాలో ఆశిష్ ఉన్నట్లు గుర్తించారు. లోకేషన్ గుర్తించిన పోలీసులు.. ఆశిష్‌ను పట్టుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
కాగా, అక్టోబర్ 3న యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులు నిరసన చేపట్టగా.. కేంద్రమంత్రి కాన్వాయ్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 9మంది ప్రాణాలు కోల్పోయాయి. అయితే, ఘటన జరిగి ఐదు రోజులైనా… ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుణ్ని అరెస్ట్ చేయకపోవడంపై.. రైతు సంఘాల నేతలు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై జ్యుడీషియరీ ఎంక్వయిరీకి ఆదేశించింది ప్రభుత్వం. ఆశిష్ విచారణకు హాజరు కాకపోవడంతో.. వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఆధారాలు లేకుండా.. ఒత్తిళ్లకు తలొగ్గి మిశ్రాపై యాక్షన్ తీసుకోలేమంటూ… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడం విశేషం. దీనిపై సిట్‌తో పాటు, స్పెషల్ జుడీషియల్ కమిషన్‌ను వేస్తున్నట్టు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న యోగి… ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. వీడియోల ఆధారంగా అందరినీ అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఆధారాలు లభిస్తే బీజేపీ ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా చర్యలు తప్పవన్నారు. అయితే, ఆశిష్ మిశ్రాను పోలీసులు అల్లుడిలా చూస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కానీ, తన కొడుకు అమాయకుడనీ.. ఏ తప్పూ చేయలేదని మరోసారి స్పష్టం చేశారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ఇక, విచారణకు హాజరు కాని కారణంగా.. ఆశిష్‌కు మరోసారి నోటీసులు పంపించారు పోలీసులు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్ లైన్స్ కార్యాలయానికి రావాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అజయ్ మిశ్రా నివాసానికి నోటీసులు అంటించారు.