NTV Telugu Site icon

Delhi Liquor Case: ఎన్నికల వేళ లిక్కర్‌‌పై కాకరేపుతున్న కాగ్ రిపోర్ట్! బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్

Kejriwal

Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగ్ రిపోర్టు లీకైనట్లుగా పేర్కొన్నాయి. దీన్ని భేష్ చేసుకుని బీజేపీ.. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఆప్ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్లు నష్టం వాటిల్లినట్లుగా బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: Indian 3 : “ఇండియన్ 3″ శంకర్ కు ‘‘గేమ్ ఛేంజర్’’ అయ్యేనా ?

మద్యం పాలసీతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఆప్ సర్కార్ విఫలమైందని.. ఆప్ నేతలంతా కిక్‌బ్యాక్‌ల ద్వారా లబ్ధి పొందినట్లుగా నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. నిపుణుల బృందం ఇచ్చిన సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం పూర్తిగా విస్మరించినట్లుగా తెలిపింది. అంతేకాకుండా పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రిమండలి, లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆమోదం కూడా తీసుకోలేదని వెల్లడించింది. లైసెన్సుల జారీ, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు పేర్కొంది. మొత్తానికి మద్యం పాలసీని సరిగా అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.2,.026 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ వ్యవహారంలో పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలను వేలం వేసేందుకు అనుమతించినట్లు తెలిపింది. వేలం వేసిన సంస్థల ఆర్థికస్థితిగతులపై ఎలాంటి పరిశీలనలు జరపలేదని.. నష్టాల్లో ఉన్న కంపెనీలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. వారికి లైసెన్సులను కూడా పునరుద్ధరించినట్లు నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: LIC Scheme: స్కీమ్ అంటే ఇది కదా.. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతి నెల రూ. 12 వేలు పొందండి

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 2021 నవంబర్‌ 17న మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్‌లో దీన్ని వెనక్కి తీసుకుంది. లిక్కర్ పాలసీలో పలు అవకతవకలు జరిగాయని.. ఆప్‌ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్‌ పాలసీని సవరించేటప్పుడు సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారనేది సీబీఐ, ఈడీ ఆరోపించాయి. లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేసి, ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టై జైలుకు వెళ్లారు. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

అయితే బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను ఆప్ నేత సంజయ్ సింగ్ తప్పుపట్టారు. ఏ ప్రామాణికంతో ఆప్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని నిలదీశారు. కాగ్ రిపోర్ట్ ఎక్కడ బయటపెట్టిందో చూపించాలని డిమాండ్ చేశారు. ‘‘కాగ్ నివేదిక ఎక్కడ ఉంది?, ఈ ఆరోపణలు ఎక్కడ నుంచి వస్తున్నాయి. బీజేపీ కార్యాలయంలో నివేదికను కాగ్ దాఖలు చేసిందా?, బీజేపీ నేతలు మానసిక స్పృహ కోల్పోయారు. కాగ్ నివేదిక సమర్పించకుండానే తప్పుడు వాదనలు చేస్తున్నారు.’’ అంటూ సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈసారి ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పార్టీల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నం చేస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. హస్తిన వాసులు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.

ఇది కూడా చదవండి: NTR : స్కాట్లాండ్‌లో సామాన్యుడిగా వీధుల్లో తిరుగుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్

Show comments