దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలు.. ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది సభ్యులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా సోమవారం (డిసెంబర్ 09) రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. 20 మంది సభ్యులతో కూడిన రెండో జాబితాను ఆమ్ ఆద్మీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Group-2 Hall Tickets: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల
ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్థానం బదిలీ అయింది. ప్రస్తుతం ఉన్న పటపఢ్ గంజ్ స్థానం కాకుండా జంగ్‌పురా నియోజకవర్గానికి మార్చబడింది. ఎన్నో ఏళ్ల నుంచి సిసోడియా పటపఢ్ గంజ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆ స్థానాన్ని ఇటీవల ఆప్‌లో చేరిన యూపీఎస్సీ ప్రముఖ కోచ్ అవధ్ ఓజాకు విడిచిపెట్టారు. పటపఢ్ గంజ్ స్థానం నుంచి ఓజా పోటీ చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిసోడియా జైలు పాలయ్యారు. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్‌పై గత ఆగస్టు నెలలో విడుదలయ్యారు. ఇదే కేసులో జైలు కెళ్లిన కేజ్రీవాల్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీఎం సీటులో అతిషిని కూర్చోబెట్టారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచాకే.. ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ: ఆడాలా.. వద్దా.. పాకిస్థానే నిర్ణయం తీసుకోవాలి : మాజీ క్రికెటర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు ఓటర్ల లిస్టు విడుదల చేయడం ఆనవాయితీ. తుది జాబితాను జనవరి 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల జాబితా విడుదలైన ఒకటి, రెండ్రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇండియా కూటమిలో ఆప్-కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్నాయి. కానీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నట్లు రెండు పార్టీలు ప్రకటించాయి. ఇక బీజేపీ కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది.
ఇది కూడా చదవండి: Syria Crisis: సిరియా సంక్షోభంపై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..!