మహారాష్ట్రలోని చంద్రపూర్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్, కలప లోడు ట్రక్కు ఢీకొనడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే బాధితులు పూర్తిగా మంటల్లో కాలి బూడిదగా మిగిలిపోయారు. గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చంద్రాపూర్-ముల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు. మృతులను నవీ దహేలీ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ మనోహర్ నాగరాలే (28), కాలు ప్రహ్లాద్ తిప్లే (35), మైపాల్ ఆనందరావు మడ్చాపే (24), బాలకృష్ణ తుకారాం తెలంగ్ (40), సాయినాథ్ బాపూజీ కొడాపే (35), సందీప్ రవీంద్ర ఆత్రమ్ (22), ట్యాంకర్ డ్రైవర్ హఫీజ్ ఖాన్ (38), వార్ధాకు చెందిన క్లీనర్ సంజయ్ పాటిల్ (35)గా పోలీసులు గుర్తించారు.
డీజిల్ ట్యాంకర్ లారీ టైర్ పగిలిపోవడంతో అది ముందు వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని.. దీంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ట్యాంకర్ నుంచి డీజిల్ కిందకు పారడంతో చెలరేగిన మంటలు చుట్టుపక్కల వ్యాపించాయని, దీంతో అనేక చెట్లు దగ్ధం అయ్యాయని వారు వివరించారు. కాగా ఈ ఘటనలో మృతి చెందిన వారి దేహాలను పోస్టుమార్టం నిమిత్తం చంద్రపూర్ ఆసుపత్రికి తరలించినట్లు ఆ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సుధీర్ నందన్వార్ తెలిపారు. మృతుల్లో ట్రక్కులో ప్రయాణించే ఆరుగురు కార్మికులతో పాటు డ్రైవర్ ఉన్నారని.. వీరితో పాటు డీజిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.