Karnataka: బెంగళూర్‌లోని కర్ణాటక అసెంబ్లీ ముందు 8మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు అప్పు తీర్చనందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. విధాన సౌద(కర్ణాటక అసెంబ్లీ) ముందు కుటుంబంలోని మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు. అయితే పోలీసులు త్వరగా జోక్యం చేసుకోవడంతో ఈ ఘటనను అడ్డుకోగలిగారు. వెంటనే వీరందర్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Congress: రామమందిర కార్యక్రమానికి వెళ్లేది లేదన్న కాంగ్రెస్ పార్టీ.. “అది ఆర్ఎస్ఎస్/బీజేపీ ఈవెంట్”..
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో 2016లో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షలు రుణం తీసుకున్నామని, అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లు ఆ కుటుంబం తమ బాధను పంచుకుంది. ఈఎంఐ తిరిగి చెల్లించడంలో కుటుంబం విఫలం కావడంతో, బ్యాంక్ వారి ఇంటిని వేలం వేసింది. దీంతోనే కుటుంబం మొత్తం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన కుటుంబ నివాసాన్ని కేవలం రూ.1.41 కోట్లకు బ్యాంకు అధికారులు వేలం వేశారు. వీరిపై ఆత్మహత్య నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. తమ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలనే, బయటకు వచ్చామని, తమ బిడ్డలకు కడుపు నిండా తిండిపెట్టేందుకు కూడా డబ్బులు లేదని సదరు కుటుంబం చెప్పింది.