Mood of the Nation: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే కోరుకుంటున్నారు. 79 శాతం ప్రజలు బీజేపీ సర్కార్‌కే మొగ్గు జై కొడుతున్నారని ఆసియా నెట్ ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే వెల్లడించింది. ప్రధానిగా ఎవరు ఉండాలనే దానికి దేశ ప్రజలు ఎక్కువ మంది నరేంద్రమోడీనే కోరుకున్నారు. బుధవారం విడుదలైన ఈ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ప్రకారం.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలను నోటిఫై చేయాలన్న నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్ణయం బీజేపీ ఎన్నికల అవకాశాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని 51.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 26.85 శాతం మంది సీఏఏ నిర్ణయం బీజేపీకి ప్రతికూలంగా ఉంటుందని విశ్వసించగా.. 22.03 శాతం మంది ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పారు. తమిళనాడుకు చెందిన 48.5 శాతం మంది సీఏఏ నిబంధనల నోటిఫై చేసే నిర్ణయం బీజేపీ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయదని అభిప్రాయపడ్డారు.
మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల గురించి ప్రశ్నించగా.. 38.11 శాతం మంది మౌలిక సదుయాపాల అభివృద్ధి పనులను ప్రశంసించారు. మరో 26.41 శాతం మంది ప్రభుత్వ డిజిటల్ ఇండియా చొరవ అని చెప్పగా, 11.46 శాతం మంది ‘ఆత్మనిర్భర భారత్’ అని వెల్లడించారు. హిందీ హార్ట్ ల్యాండ్‌లో 30.04 శాతం మంది రామమందిరన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం అతిపెద్ద విజయాన్ని సాధించిందని అన్నారు. ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాబోయే ఎన్నికల్లో రామమందిరమనే ప్రధాన అంశం అవుతుందని 57.16 శాతం మంది చెప్పారు. 31 శాతం మంది మాత్రం వేరే విధంగా స్పందించారు. 51.06 శాతం మంది ప్రధానిగా నరేంద్రమోడీ ఉండాలని కోరుకోగా.. తర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ 46.45 శాతంతో ఉన్నారు. కేరళ రాష్ట్రం మాత్రం రాహుల్ గాంధీకి 50.59 శాతం మంచి రేటింగ్‌ని ఇచ్చింది. 80 శాతం మంది నరేంద్రమోడీ జాతీయ నాయకుడిగా ఎదగడాన్ని చూశామన్నారు. ఉచితాల పట్ల ప్రజలు విముఖతగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 80.5 శాతం మంది తమ ఓటును నిర్ణయించేది అభివృద్దే అని, కులాలు, ఉచితాలు కావని చెప్పారు.
Read Also: SRH: అభిషేక్ ఊచకోత.. 16 బంతుల్లో 50
60.33 శాతం మంది ప్రజలు, బీజేపీ పాలన లేని రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష కూటమి 2024లో మోడీ వేవ్‌ని అధిగమించలేదని అభిప్రాయపడ్డారు. కేవలం 32.28 శాతం మంది మాత్రమే ఇండియా కూటమి, బీజేపీపై పైచేయి సాధిస్తుందని అన్నారు. ఇండియా కూటమికి నాయకత్వ లోపం, ముందు చూపు లేకపోవడం, ప్రధాన మంత్రి అభ్యర్థులు ఎక్కువ మంది ఉండటం వైఫల్యమని 48.24 శాతం మంది విశ్వసిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పరిస్థితిని మెరుగుపరిచిందని 38.12 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మోడీ వైఫల్యాల్లో మణిపూర్ అంశం ప్రధానమైనదదని 32.86 శాతం మంది భావిస్తున్నారు. మైయిటీ, కుకీల మధ్య తగదాను నిర్మూలించడంలో వైఫల్యం చెందారని భావిస్తున్నారు. మిగతా వైఫల్యాలలో ఇంధన ధరలు (26.2 శాతం), నిరుద్యోగం (21.3 శాతం), ద్రవ్యోల్బణం (19.6 శాతం) ఉన్నాయి. ఉత్తర-దక్షిణ భారత విభజన తీసుకువచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం జరుగుతోందని 51.36 శాతం భావిస్తున్నారు. మోడీ పాలనలో మధ్యతరగతి జీవితం మెరుగుపడిందని 47.8 శాతం మంది అభిప్రాయపడగా.. 46.1 శాతం మంది దీని భిన్నంగా స్పందించారు. 51.07 శాతం మంది మోడీ తన హామీలను నెరవేర్చారని చెబుతున్నారు. అవినీతిని అరికట్టారని 60.04 శాతం మంది సమర్థించారు. 79.27 శాతం మంది మోడీ హాయాంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ పరపతి పెరిగిందన్నారు. 78.6 శాతం మంది ఎన్డీయేనే అధికారంలోకి రావాలని కోరుకోగా.. 21.4 శాతం మంది ఇండియా కూటమికి ఓటేశారు. ఆసియా నెట్ మొత్తం 7.59 లక్షల మంది అభిప్రాయాలతో ఈ సర్వేని రూపొందించింది.