Odisha: ఒడిశాలోని బెర్హంపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరాలా మహారాజా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు కాలేజీ హాస్టల్‌లో ‘గొడ్డు మాంసం’’ వండారనే ఆరోపణలతో వారిని బహిష్కరించారు. ఈ ఘటనపై ఉద్రిక్తతలు పెరగడంతో అధికారులు కాలేజీ సమీపంలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బహిష్కరణలతో పాటు ఒక్కొక్కరికి రూ. 2000 జరిమానా విధించారు.
Read Also: Trump Assassination Attempt: రెండోసారి ట్రంప్‌పై అటాక్.. హత్యకు యత్నించిన ర్యాన్ రౌత్ ఎవరు..?
ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. దీనిపై పలువురు విద్యార్థులు డీన్‌కి ఫిర్యాదు చేశారు. ‘‘ విద్యార్థులందరి విలువలు మరియు విశ్వాసాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. ఈ సంఘటన (గొడ్డు మాంసం వండటం) అశాంతి మరియు అసౌకర్యానికి కారణమైంది, ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను దయతో అభ్యర్థిస్తున్నాము’’ అని విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హాల్స్ ఆఫ్ రెసిడెన్స్ (HoR) నియమాలు, సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా బహిష్కరించినట్లు సెప్టెంబరు 12 న స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం నుండి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబర్ 11 రాత్రి ఫల్గుణి హెచ్ఓఆర్ రూమ్ నెంబర్ బీ-23లోని విద్యార్థులు నిషేధించబడిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు నోటీసులు పేర్కొన్నాయి. ఈ సంఘటనపై బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు బీఫ్ తినడంతో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా వడ్డించారని వీహెచ్‌పీ ఆరోపించింది.