Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు వేశారు.
Read Also: Rajanna Sircilla: సిరిసిల్లలో దారుణం.. మహిళపై వలస కూలీల అత్యాచారం..హత్య..!
ముగ్గురు ఇండిపెండెంట్లు – ఆశిష్ శర్మ (హమీర్‌పూర్ నియోజకవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కెఎల్ ఠాకూర్ (నాలాగర్) శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి యశ్ పాల్ శర్మకు రాజీనామా సమర్పించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరికి బీజేపీ టికెట్లు నిరాకరించడంతో, ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఆ తర్వాత 40 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఈ ముగ్గురూ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
అయితే, సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తమను, తమ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో అధికార కాంగ్రెస్‌కి 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే, వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సంఖ్యాబలం 34కి పడిపోయింది. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.