Earthquake: గురువారం జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8గా తీవ్రత నమోదైంది. ఒక్కసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్)లో పోస్ట్‌లో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్ట్‌పై స్పందించిన మాజీ పీఎం షేక్ హసీనా..
భూమికి దిగువన 2019 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది. కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని అధికారులు చెప్పారు. భూకంపాలు సంభవించే జోన్‌లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఉంది. ముఖ్యంగా హిమాలయాలు ఉన్న ప్రాంతం అంతా భూకంపం వచ్చే జోన్ పరిధిలోకే వస్తుంది. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ యూరేషియా టెక్టానిక్ ప్లేట్‌ని ముందుకు నెడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగానే తరుచుగా ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుంటాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాబోయే కాలంలో హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.