36 మంది కొత్త ముఖాలు.. ఏడుగురికి ప్రమోషన్.. మోడీ 2.ఓ కేబినెట్‌లో ఈక్వేషన్స్ ఇవి..! కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ.. చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రాంతాలు, సామాజిక లెక్కలతో మోదీ తన కొత్త టీమ్‌ను ఎంపిక చేశారు. మొత్తం మందిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. మహారాష్ట్రకు చెందిన నారాయణ రాణెను మోడీ తన టీమ్‌లోకి తీసుకున్నారు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కి కేబినెట్ హోదా దక్కింది. ఇక వీరేంద్రకుమార్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు కేబినెట్ బెర్త్ దక్కింది. ఆయన దాదాపు 16 నెలల నుంచి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌కి, బీజేపీ యువనేత అశ్వినీ వైష్ణవ్, ఎల్‌జేపీ పార్లమెంటరీ నేత పశుపతి కుమార్ పరాస్ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇక మోడీ కేబినెట్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన కిరణ్ రిజిజుకు కేబినెట్ బెర్త్ దక్కింది. వీరితో పాటు ఆర్కే సింగ్, విమానయాన శాఖ మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరికి, మన్‌సుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలాలకు ప్రమోషన్ దక్కింది. బీజేపీ సీనియర్ నేత భూపిందర్ యాదవ్‌కి కేబినెట్ హోదా దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి పనితీరుకు గుర్తింపు దక్కింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. అటు అనురాగ్ ఠాకూర్‌కి కూడా ప్రమోషన్ దక్కింది. మొత్తం 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో అప్నాదళ్ ఎంపీ అనుప్రియా సింగ్ పటేల్, కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికైన రాజీవ్ చంద్రశేఖరన్‌లు ఉన్నారు. ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖిలు ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలు, వర్గ సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం కల్పించేలా కేబినెట్ కూర్పు సాగింది. అంతేకాదు.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు.