Niaph Virus: కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరికి వైరస్ సోకినట్లు తెలిసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6కి చేరింది. ఇప్పటికే ఇందులో ఇద్దరు మరణించారు. తాజాగా 39 ఏళ్ల వ్యక్తికి నిపా పాజిటివ్ గా తేలింది. 2018 నుంచి చూస్తే కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ నాలుగో సారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న నిఫా ‘‘బంగ్లాదేశ్ వేరియంట్’’అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
ప్రస్తుతం నమోదవుతున్న నిపా కేసులన్నీ కోజికోడ్ జిల్లాలోనే నమోదయ్యాయి. బుధవారం ఓ హెల్త్ వర్కర్ కి నిపా పాజిటివ్ అని తేలింది. అతని కాంటాక్ట్ లిస్టులో 706 మంది ఉండటం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇందులో 77 మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారు. 153 మంది ఆరోగ్య కార్యకర్తలు ఇతని కాంటక్ట్ లిస్టులో ఉన్నారు. కాగా, హై రిస్కులో ఉన్నవారికి ఎవరికీ లక్షణాలు కనిపించడం లేదని వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ప్రస్తుతం 13 మంది ఆస్పత్రుల్లో పరిశీలనలో ఉన్నారు. వారికి తలనొప్పి వంటి తేలిక లక్షణాలు కనిపిస్తున్నాయిన ఆమె వెల్లడించారు.
Read Also: Jammu Kashmir Encounter: 48 గంటలుగా కొనసాగుతున్న ఉగ్రవేట..
ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స లేదు. అయితే ఇప్పుడున్న వాటిలో ‘మోనో క్లోనల్ యాంటీబాడీ’ చికిత్స మాత్రమే సమర్థవంతంగా ఉంది. ఇప్పుడు ఇవి కేరళకి చేరుకున్నాయి. జ్వరం, శ్వాసకోశ సమస్య, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి ముదిరితే మెదడు వాపు, మూర్చ, చివరకు కోమాలోకి వెళ్లి మరణం సంభవిస్తుంది. 2018లో కేరళలో నిపా విజృంభించడంతో 21 మంది చనిపోయారు. ఆ తరువాత 2019, 2021లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.
గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది, కాబట్టి అటవీ ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. తాజాగా సోకిన నిపా కేసులు అటవీ ప్రాంతం నుంచి 5 కిలోమీటర్లలోనే ఉద్భవించాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు కోజికోడ్ జిల్లాలో అతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర, వీల్యపల్లి, పురమేరి పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. స్కూళ్లకు సెలవులను ప్రకటించి, ప్రజల కార్యకలాపాలను తగ్గించారు.