Nirmala Sitharaman: దేశాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో విద్యాబోధన జరగాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిశ్రమలకు ఏం అవసరమో భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశ్రమలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న విద్యార్థులను విద్యా సంస్థలు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కాంచీపురం (ఐఐఐటీడీఎం కాంచీపురం)లో శనివారం జరిగిన పదవ స్నాతకోత్సవంలో మొత్తం 380 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారతదేశ ఉన్నత విద్య ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను తయారుచేయడంలో దోహదపడిందని.. సిలికాన్ వ్యాలీలోని మొత్తం స్టార్టప్‌లలో 25 శాతం భారత సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారని నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే భారతదేశ ఉన్నత విద్య తక్కువ లేదా బలహీనమైనది కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను నిర్వహించడంలో భారతీయ విశ్వవిద్యాలయాలలో చదివే వ్యక్తులు రెండో అతిపెద్ద పోటీదారులు అని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 58 అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు భారతీయ విద్యను అభ్యసించారని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి సహకరిస్తోందన్నారు.
Doctors Cheating: ఏం వైద్యులు రా.. బాబు..! గర్భాశయం తొలగిస్తామని కిడ్నీలే మాయం చేశారు..!
దేశంలో అత్యంత విలువైన అంకుర సంస్థల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో 100కు పైగా యూనికార్న్ (100 కోట్ల డాలర్లు/రూ.8000 కోట్ల విలువైన) సంస్థలున్నాయని, వీటి మొత్తం విలువ 250 బిలియన్ డాలర్ల (రూ.20 లక్షల కోట్ల)కు పైగా ఉంటుందని చెప్పారు. గత కొన్నేళ్లలో ఇవి కేపిటల్ మార్కెట్ల నుంచి 63 బిలియన్ డాలర్లు సమీకరించాయని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోనూ సుమారు 25 శాతం అంకురాలను భారత సంతతి వ్యక్తులే నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని తెలిపారు.
మన నినాదాలైన జై జవాన్, జై కిసాన్‌లకు జై విజ్ఞాన్, జై అనుసంధాన్ జతయ్యాయని తెలిపారు. ‘నినాదంలోని చివరి రెండు పదాల్లో మీరు పోషించే పాత్రకు గుర్తింపు లభిస్తుందని, అదే 2047 నాటికి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లకు అభివృద్ధి చెందిన దేశంగా, సాంకేతికతకు కేంద్రంగా భారత్ అవతరించేందుకు దోహదం చేస్తుంద’ని మంత్రి చెప్పారు.
భారతీయులు దాఖలు చేసిన మొత్తం పేటెంట్ల సంఖ్య 2021-22 నాటికి 66,400 కు పెరిగిందని, 2014-15 లో 42,000 తో పోలిస్తే ఇది పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. ఈ ఏడాది ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కూడా సైన్స్, గణితంలో 750 వర్చువల్ ల్యాబ్ లు, భారతదేశానికి స్వాతంత్రం 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిమ్యులేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోసం 75 స్కిల్లింగ్ ఈ-ల్యాబ్ లను ప్రభుత్వం ప్రకటించింది.