NTV Telugu Site icon

Shiv Sena: షిండే క్యాంప్‌తో టచ్‌లో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు..?

Shiv Sena

Shiv Sena

Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆ రాష్ట్రంలో దారుణంగా విఫలమైంది. మొత్తం 48 ఎంపీ సీట్లలో బీజేపీ కూటమి 17 స్థానాలకే పరిమితం కాగా, ఇండియా కూటమి 30 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, ఉద్దశ్ శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 08 సీట్లను గెలుచుకుంది. అనూహ్యంగా బీజేపీ 09 స్థానాలకు మాత్రమే పరిమితమైంది, షిండే శివసేన 07 స్థానాలను గెలుచుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ 01 స్థానంలో సరిపెట్టుకుంది.

Read Also: Sheikh Hasina: ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. ఘన స్వాగతం

ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్ పాలిటిక్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నునంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నట్లు షిండే వర్గం శనివారం పేర్కొనడం సంచలనంగా మారింది. శివసేన(షిండే) అధికార ప్రతినిధి నరేష్ మాస్కే మాట్లాడుతూ.. ఇద్దరు ఎంపీలతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పారు. అయితే, వారి పేర్లు వెల్లడించలేదు.

ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన కొందరి ఓట్లను ఉద్ధవ్ ఠాక్రే అడగటంపై ఇద్దరు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నరేష్ చెప్పారు. కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి ఈ ఇద్దరు మద్దతు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు షిండే వర్గం ఎమ్మెల్యేలు ఠాక్రే వర్గంలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని శివసేన(ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నరేష్ మాస్కే వ్యాఖ్యలు రావడం గమనార్హం.