Maharashtra: గత మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి. అయితే ఆ సమయంలో సీఎం పీఠాన్ని కొరడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ‘మహావికాస్ అఘాడీ’ పేరుతో కూటమి కట్టాయి. అయితే ఈ సమయంలో శరద్ పవార్ చాణక్యం ముందు బీజేపీ నిలువలేకపోయిందనే వార్తలు బాగా వచ్చాయి. కానీ వారికి ఆ సమయంలో తమ పార్టీలకు బీజేపీ ఎసరు పెడుతుందనే విషయం బహుషా తెలియకపోవచ్చు. బీజేపీ మార్క్ రాజకీయం ముందు ఇటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే, అటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిలువలేకపోయారు. కేవలం రెండేళ్లలోనే వారి పార్టీలు విచ్ఛిన్నమయ్యాయి.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఏకంగా శరద్ పవార్ ను మించి చాణక్యం ప్రదర్శించారు. ఏడాది క్రితం ఏక్ నాథ్ షిండే రూపంలో ఉద్ధవ్ ఠాక్రేను ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే కనీసీం అసమ్మతిని గమనించలేకపోయారు. ఇక్కడే బీజేపీ మార్క్ చాణక్యం బయటపడింది. ఎమ్మెల్యేలంతా అస్సాం గౌహతి వెళ్లేదాకా కూడా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు. చివరకు ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పడింది. 40 మంది ఎమ్మెల్యేలు షిండే పక్షాన నిలిచారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీని, పార్టీ గుర్తును కోల్పోయారు.
Read Also: Modi Tour: ప్రధాని మోదీ పారిస్ పర్యటనకు ముందు ఫ్రాన్స్ భారత్‌కు భారీ ఆఫర్..!
తాజాగా అజిత్ పవార్ రూపంలో, శరద్ పవార్ కు పెద్ద దెబ్బ పడింది. మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 40 మంది అజిత్ పవార్ పక్షాన నిలిచారు. ఇందులో అజిత్ పవార్ తో సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారు. ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి చెందిన మొత్తం 53 మంది ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా తమకు మద్దతు ఉందని అజిత్ పవార్ చెప్పినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల నుంచి తప్పించుకోవడానికి అజిత్ పవార్‌కు 36 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండాలి.