Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి. టాన్నర్ ఫాక్స్, జోస్ లోపెజ్ ఇద్దరు 75 ఏళ్ల రిపుదమన్ సింగ్ మాలిక్‌ని 2022లో సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఈ కేసు విచారణ సందర్భంగా సోమవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
రిపుదమన్ సింగ్, అజైబ్ సింగ్ బగ్రీ ఇద్దరూ కూడా కెనడా మాంట్రియల్ నుంచి బయలుదేరి ముంబైకి వెళ్తున్న ఏయిరిండియా కనిష్క విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంపై ఉన్న సమయంలో పేల్చివేసిన ఘటనలో అనుమానితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరిద్దరు 2005లో నిర్దోషులుగా విడుదలయ్యారు. రిపుదమన్‌ని చంపిన ఇద్దరికి తక్కువ అభియోగాలకు సంబంధించి సెకండ్ డిగ్రీ హత్య నేరం మోపబడింది. రిపుదమన్‌ని చంపడానికి వేరే వ్యక్తులు వీరిద్దరిని నియమించుకున్నట్లు కోర్టు నివేదిక తెలిపింది. అయితే, ఈ కేసులో వీరిద్దరికి కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తులను కోర్టు ముందుకు కెనడా పోలీసులు తీసుకురావాలని రిపుదమన్ సింగ్ కుటుంబం కోరింది.
Read Also: J-K: చైనా కోసమే కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి
ఎయిరిండియా కనిష్క కేసు:
జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 39 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు. కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్, ఢిల్లీ మీదుగా ముంబై చేరాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 329 మంది మరణించారు. మొదటి స్టాప్ ఓవర్ లండన్ హీత్రూ విమానాశ్రయంలో దిగడానికి 45 నిమిషాల ముందు ఐర్లాండ్ తీరానికి 190 కి.మీ దూరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూలిపోయింది. రాడాన్ నుంచి అదృశ్యమైన వెంటనే రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఒక్క ప్రయాణికుడు కూడా బతకలేదు. సముద్రం నుంచి 131 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. విమానం 31,000 ఫీట్‌ల ఎత్తులో ఉన్న సమయంలో బాంబు పేలుడు సంభవించినట్లు తేలింది. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటీష్ జాతీయులు, 24 మంది భారతీయులు మరణించారు.