ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తాజాగా అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడో ఆ సీసీటీవీ ఫుటేజ్‌లను అధికారులు సేకరించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉమర్ రెండు సెల్‌ఫోన్లు ఉపయోగించినట్లుగా గుర్తించారు. అయితే పేలుడు సమయంలో ఈ రెండు ఫోన్ల ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో దర్యాప్తు అధికారులు ఫోన్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆ రెండు ఫోన్లు ఎలా మిస్ అయ్యాయి. బ్లాస్ట్‌కు ముందు ఉమర్ ఎవరికైనా ఇచ్చాడా? లేదంటే ఎక్కడైనా భద్రపరిచాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోన్లలోనే కీలక సమాచారం ఉండొచ్చని భావిస్తున్నారు.
ఉమర్ జర్నీ ఎలా సాగిందంటే…
పేలుడుకు ఒక రోజు ముందు నవంబర్ 9న ఉగ్రవాది ఉమర్.. ఫరీదాబాద్, నుహ్, బల్లబ్‌గఢ్, సమీప ప్రాంతాల్లో సంచరించినట్లుగా దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి గుర్తించారు. ఉమర్ ప్రయాణించిన మార్గంలో మసీదులు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లు, స్నాక్స్ సెంటర్లు, మెడికల్ స్టోర్లలో ఉన్న సీసీకెమెరాలను అధికారులు జల్లెడ పట్టారు. ఈ సీసీటీవీలో రికార్డైన దానిని బట్టి చూస్తే.. ఎవరో ఉమర్‌కు మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా అతనికి నిధులు కూడా సమకూర్చినట్లుగా తెలుస్తోంది.
ఇక హర్యానాలోని ఒక మెడికల్ షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌లో రెండు సెల్‌ఫోన్లు ఉపయోగించినట్లుగా కనిపించింది. బ్లాస్ట్‌కు ముందు వరకు కూడా ఈ రెండు ఫోన్లే ఉపయోగించాడు. ఢిల్లీ, ఫరీదాబాద్, మేవాత్ ప్రాంతాల్లో ఇతర నెంబర్లు కనెక్ట్ అయ్యాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు ఉమర్ ఈ రెండు సెల్‌ఫోన్లు ఉయోగించినట్లుగా సిగ్నల్ పాయింట్‌ను బట్టి తేలింది. అయితే పేలుడు సమయంలో మాత్రం ఈ రెండు సెల్‌ఫోన్ల సిగ్నల్ ట్రాక్ అవ్వలేదు. అంటే బ్లాస్ట్‌కు ముందే రెండు సెల్‌ఫోన్లు మిస్ అయ్యాయి. ఎవరికో ఇచ్చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో రెండు సెల్‌ఫోన్ల కోసం అధికారులు తీవ్రంగా జల్లెడ పడుతున్నారు. సెల్‌ఫోన్లు దొరికితే ఉమర్‌ను ఎవరు నడిపిస్తున్నారో తేలిపోనందని ఒక అధికారి పేర్కొన్నారు. ఇక ఉమర్ తరుచుగా ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ను ఉపయోగించినట్లు కనిపెట్టారు. ఈ పరికరం అత్యంత రహస్యంగా ఉంటుంది.
ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందాలు ఉమర్ కదలికలను సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. నిమిష నిమిషానికి ఏం జరిగిందన్న దానిని పునర్నిర్మిస్తున్నాయి. టవర్ డేటా, సీసీటీవీ క్లిప్‌లు, చాట్ లాగ్‌లు, సాక్షుల స్టేట్‌మెంట్‌లను ఉపయోగించి ఫరీదాబాద్ నుంచి నుహ్ వరకు అక్కడ నుంచి ఢిల్లీ వరకు ఉన్న మార్గాన్ని ట్రాక్ చేస్తున్నారు.
ఇక అక్టోబర్ 30న ఉమర్ ఉపయోగించిన రెండు ఫోన్ల నెంబర్లను డీయాక్టివేట్ చేశాడు. అదే రోజు సన్నిహితుడు డాక్టర్ ముజమ్మిల్ అరెస్ట్ అయ్యాడు. ఏదో జరుగుతుందన్న భయంతో రెండు నెంబర్లు డీయాక్టివేట్ చేసేశాడు. దీంతో నకిలీ పేర్లుతో రెండు కొత్త ప్రీపెయిడ్ సిమ్ కార్డులు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.
అక్టోబర్ 30న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం నుంచి ధౌజ్ మార్కెట్‌లో ఉన్న సీసీకెమెరాలో నల్ల బ్యాగ్, రెండు ఫోన్లతో మెడికల్ స్టోర్ లోపల కూర్చున్నట్లు కనిపించింది. ఒకదాన్ని ఛార్జింగ్ కోసం దుకాణం యజమానికి అందజేశాడు. మరొకటి చేతిలో ఉంచుకున్నాడు. ఒకటేమో సాధారణ కమ్యూనికేషన్ కోసం.. ఇంకొకటి హ్యాండ్లర్లతో మెసేజింగ్ కోసం ఉపయోగించినట్లుగా కనిపెట్టారు. ఇక పేలుడుకు ఒక రోజు ముందు.. అనగా నవంబర్ 9న రెండు ఫోన్లు ఏ ఫుటేజ్‌లోనూ కనిపించలేదు. ఇక నవంబర్ 10న తుర్క్‌మాన్ గేట్‌లోని ఫైజ్ ఎలాహి మసీదు దగ్గర మాత్రం ఎవరితోనూ మాట్లాడలేదు. ఏమీ వదిలిపెట్టనులేదు. అంటే అప్పటికే ఆ రెండు ఫోన్లు ఎవరికో అప్పగించి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదంటే ఎక్కడైనా పడేసి ఉండొచ్చని కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం మసీదుకు వచ్చిన వారి డేటాను సేకరిస్తున్నారు. మసీదులో ఉన్నవారు ఎవరైనా కుట్రదారులుగా వ్యవహరించి ఉంటారా? అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.
ఇక మసీదు నుంచి నేరుగా ఎర్రకోట సమీపంలోని సునేహ్రీ మసీదు పార్కింగ్‌కు వెళ్లాడు. అక్కడ హ్యుందాయ్ ఐ20 కారును ఒక మూలలో పార్కు చేయబడినట్లుగా కనిపించింది. ఇక సన్నిహితుడు ముజమ్మిల్‌తో మాట్లాడేటప్పుడు ‘‘డెలివరీ’’, ‘‘టెస్టింగ్’’, ‘‘షిప్‌మెంట్’’ అనే కోడ్ భాషను ఉపయోగించాడు. ప్రస్తుతం ఈ భాషపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇక నుహ్‌లోని ఫిరోజ్‌పూర్ ఝిర్కాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి మరో ప్రధాన క్లూ వచ్చింది. నవంబర్ 10న తెల్లవారుజామున 1.07 గంటలకు అనగా పేలుడుకు దాదాపు 17 గంటల ముందు రెండు విడతలుగా రూ.76,000 విత్‌డ్రా చేస్తున్నట్లు కనిపించింది. ఇక అక్కడే డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు మోహర్ సింగ్ దర్యాప్తు అధికారులకు కీలక సమాచారం అందించాడు. తనకు అత్యవసరంగా వైద్య ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడని.. దీంతో ఏటీఎం సెంటర్ చెప్పానని.. దీంతో తనకు రూ.1,000 టిప్ ఇచ్చినట్లుగా కూడా చెప్పాడు. అలాగే కారు వెనుక సీటులో బెడ్‌షీట్ మెటీరియల్‌తో కప్పబడిన వస్తువులు చూసినట్లు తెలిపాడు. అసహనంతో.. ఆందోళనతో కనిపించినట్లుగా వివరించాడు. ఇక పేలుడు జరిగిన ప్రదేశంలో మూడు కార్ట్రిడ్జ్‌లు, రెండు లైవ్ రౌండ్లు, ఒక ఖాళీ 9mm షెల్‌ను కనుగొన్నారు. ఈ రకమైన మందుగుండు సామగ్రిని సాధారణంగా భద్రతా దళాలు లేదా ప్రత్యేక అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే ఉపయోగిస్తారు. చనిపోయిన వారిలో ఎవరు కూడా భద్రతా దళాలకు సంబంధించిన వాళ్లు లేరు. అవి ఉమర్‌కు ఎలా వచ్చాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కారులో బుల్లెట్లు తీసుకెళ్లాడా? బ్లాస్ట్‌కు ముందు ఆయుధాన్ని ఎక్కడైనా పడేశాడా?.. లేదంటే ఇంకో వ్యక్తి ప్రమేయం ఉండొచ్చా? ఆ దిశగా కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారులు శోధన చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!