Pirate attack: తమిళనాడు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో శ్రీలంకకు చెందిన పైరెట్స్(సముద్రపు దొంగలు) దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 17 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లు శుక్రవారం కోరమండల్ తీరంలో చేపలు పడుతుండగా దాడి జరిగినట్లు చెప్పారు.
ఫైబర్ బోట్‌లో వచ్చిన ఆరుగురు దొంగలు మత్సకారుల వద్ద ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకుని వెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. పదునైన ఆయుధాలతో భారత పడవల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. ఈ దాడి భారత సముద్ర జలాల్లో జరిగిందని వెల్లడించారు.
ఒడ్డుకు వచ్చిన తర్వాత గాయపడిన 17 మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, తమను ఆదుకోవాలని, ఇలాంటి దాడులు కొనసాగితే నిరవధిక సమ్మెకు వెళ్తామని మత్స్యకారులు హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో ముగ్గురు తమిళనాడు మత్స్యకారులు గాయపడ్డారు.