NDA: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరిలోనూ ఇదే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 15 ఏళ్ల తర్వాత బీజేడీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసిపోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారికంగా పొత్తుపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు పార్టీల నేతలు మాత్రం పొత్తుపై సంకేతాలు ఇస్తున్నారు. సీట్ల పంపకంలో చర్చలు విఫలమైన తర్వాత 11 ఏళ్ల రాజకీయ భాగస్వామ్యం తర్వాత 2009లో బీజేడీ ఎన్డీయే నుంచి వైదొలిగింది.
ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 13 స్థానాల్లో బీజేడీ, 8 స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని బీజేడీ వర్గాలు తెలిపాయి. అయితే, బీజేపీ 9 లోక్‌సభ స్థానాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 55 సీట్లను కోరుకుంటోంది. ప్రస్తుతం బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బుధవారం నవీన్ పట్నాయక్, పార్టీ కీలక నేతలతో తన నివాసంలో 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఒడిశా బీజేపీ నాయకులు కూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో సమాంతర సమావేశాలను నిర్వహించారు. సమావేశంలో వారు బీజేడీతో పొత్తు గురించి చర్చించినట్లు సమాచారం. బీజేడీ సమావేశం తర్వాత ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాలకు బీజేడీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని బీజేడీ సీనియర్, ప్రధానకార్యదర్శి అరుణ్ కుమార్ సాహూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. పొత్తుపై కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎంపీ జుయల్ ఓరమ్ తెలిపారు.
2019 ఎన్నికల్లో బీజేపీ 8 మంది ఎంపీలను గెలుచుకోగా.. 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీకి 12 ఎంపీ, 112 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 1998లో బీజేడీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీలు 2009లో విడిపోయాయి.
కంధమాల్ అల్లర్లలో పొత్తుకు బీటలు:
ఆగస్ట్ 25, 28, 2008 మధ్య జరిగిన పెద్ద ఎత్తున హింసలో దాదాపు 40 మంది క్రైస్తవులు మరణించారు. 395 చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి మరియు 600 గ్రామాలు దోచుకున్నాయి. అదనంగా, 5,600 కంటే ఎక్కువ ఇళ్లు లూటీ చేయబడ్డాయి మరియు 54,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, అతని నలుగురు అనుచరులను ముసుగులో వచ్చిన దుండగులు హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. వీరి హత్యకు మావోయిస్టులు కారణమని పోలీసులు ఆరోపించినప్పటికీ.. కంధమాల్ జిల్లాలోని స్థానికులు మాత్రం ఈ హత్యల వెనకాల క్రిస్టియన్ ఆదివాసీల హస్తం ఉందని భావించారు, దీంతో అల్లర్లు ప్రారంభయ్యాయి.
సరస్వతి అనేక పాఠశాలలు, ఆశ్రమాలను స్థాపించారు. వీహెచ్‌పీ, సంఘ్ పరివార్ సంస్థలు క్రైస్తవం నుంచి తిరిగి హిందూ మతంలోకి రావడానికి చర్యలు తీసుకున్నాయి. ఇదిలా ఉంటే అల్లర్లకు ముందు డిసెంబర్ 2007న క్రిస్మస్ సందర్భంగా సంఘ్ పరివార్, క్రైస్తవులకు మధ్య ఘర్షణ జరిగింది. వందలాది ఇళ్లు తగలబడ్దాయి, దీనికి ప్రతిగా క్రైస్తవ మూకలు, హిందువుల ఇళ్లను తగలబెట్టారు.
అల్లర్లు జరిగిన ఒక ఏడాది తర్వాత 2009లో నవీన్ పట్నాయక్ బీజేపీ వాటాను 9 ఎంపీ స్థానాల నుంచి 6కి, అసెంబ్లీలో 63 నుంచి 40కి తగ్గించాలని ప్రతిపాదించాడు. దీంతో కంధమాల్ అల్లర్లకు కారణంగా బీజేడీ, బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. కంధమాల్ అల్లర్లలో దోషిగా 2010లో బీజేపీ ఎమ్మెల్యే మనోష్ ప్రధాన్‌తో సహా 18 మంది దోషులుగా తేలారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది.
అయితే, ఎన్డీయే నుంచి వైదొలిగినప్పటికీ నవీన్ పట్నాయక్ బీజేపీతో, ప్రధాని మోడీతో సఖ్యతతోనే ఉంటున్నారు. 2012, 2017, 2022లో జరిగి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒడిశా పర్యటనలో ప్రధాని మోడీ నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్‌కి నివాళులు అర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి బిజూ బాబా సేవలు సాటిలేనివని ప్రధాని కొనియాడారు.