Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 14 మంది మైనర్ బాలికలు మణికట్టు కోసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లే బాలికల ఎడమచేతి మణికట్టుపై గాయాలు ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలికలంతా దండేలి ప్రాంతానికి, ఒకే పాఠశాలకు చెందిన 9,10 తరగతి విద్యార్థులే అని తేలింది. వారి మణికట్టుపై రేజర్ కోతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. అయితే బాలికలు ఎందుకు ఇలా ప్రవర్తించారనే దానిపై ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రుల నుంచి సరైన వివరణ లేదని అధికారులు చెబుతున్నారు. 14 మంది బాలికల ఎడమ చేతి మణికట్టుపై గాయాలు ఉన్నాయి, కొందరు బాలికల చేతులపై 14-15 గాయాలు కనిపించాయి. సాధారణంగా షేవింగ్ కోసం ఉపయోగించే రేజర్ బ్లేడ్ తో గాయాలు చేసుకున్నట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు.
Read Also: TV news channels: ఉగ్రవాదులకు వేదిక కావద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్..
బాలికలందర్ని దండేలి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పెద్దగా అపాయం ఏం లేదని వైద్యులు చెప్పారు. ఉత్తర కన్నడ జిల్లా ఉన్నతాధికారులు మాట్లాడారు. ఈ ఘటనలో మానసిక వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులకు కూడా ఏం అర్థం కావడం లేదని వారు చెప్పారు. ఉత్తర కన్నడలోని డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గంగూబాయి మాన్కర్ మాట్లాడుతూ.. ఇందులో ఐదారుగురు బాలికలు తమ తల్లిదండ్రులు తిట్టడం వల్లే ఇలా చేశామని, మరొకరు తన స్నేహితురాలు మాట్లాడకపోవడంతో ఇలా చేశానని చెప్పిందని తెలిపారు. దీని గురించి విచారించేందుకు ప్రత్యేక పోలీస్ టీంను రంగంలోకి దింపారు. ఈ ఘటన వెనక కారణాలను తెలుసుకునేందుకు సైకియాట్రిస్టుల సాయం తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.