తమిళనాడుకు ఒక వరుణగండం తీరింది.. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. లాండ్ ఫాల్ తర్వాత వాయుగుండం తీవ్ర తగ్గుతుందని వాతావరణశాఖ చెబుతోంది. అయితే, శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ఇటు తూర్పు అండమాన్ మీదుగా రేపటికల్లా మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. నవంబర్ 17వ తేదీకి ఇది మరింత బలపడి కోస్తాంధ్ర మీదుగా తీరం దాటే సూచనలున్నట్టు తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్షాలతో తమిళనాడులో మొత్తం 15 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గురువారం ఒక్కరోజే దాదాపు 12, 300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు వర్షాల ధాటికి పద్నాలుగు మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. లక్షలాది ఎకరాల్లో వరిపంట నీట మునిగిందని, కూరగాయల తోటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. పంటల నష్టాన్ని అంచనా వేయడానికి సీఎం స్టాలిన్ మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించారు. తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం, కడలూరు, మధురై, నాగపట్నం, తంజావూరు జిల్లాల్లో నష్టం తీవ్రంగా కనిపిస్తోంది. తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. శుక్రవారం కూడా భారీ వర్షాలు పడే సూచన ఉండటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దనే హెచ్చరికలు జారీ చేశారు. పది జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు అందిస్తున్నాయి. మరో రెండు జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నవారికి పాలు, బిస్కెట్లను అందిస్తున్నారు.