Himachal Landslide: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 128 రోడ్లను అధికారులు మూసివేశారు. అలాగే, ఇవాళ (శనివారం) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది.
కాగా, మండి, బిలాస్‌పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ఉనా, హమీర్‌పూర్, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే, బలమైన ఈదురు గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా పంటలు, ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. కాగా, ఇప్పటికే మండిలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్‌లో నాలుగు, హమీర్‌పూర్ జిల్లాలో రహదారులను మూసివేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, గురువారం సాయంత్రం నుంచి మండి జిల్లాలోని జోగిందర్‌నగర్‌లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుఫ్రిలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో 321.8 మిమీ వర్షపాతం నమోదైంది.