Indians In Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం 12 మంది భారతీయులు మరణించినట్లు ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన భారతీయులు అంతా రష్యా తరుపున పోరాడిన వారేనని వెల్లడించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజు వరకు రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య 126గా నమోదైందని, ఈ కేసుల్లో 96 మంది ఇండియాకు తిరిగి వచ్చారని చెప్పారు. 18 మంది భారత పౌరులు ప్రస్తుతం రష్యన్ సైన్యంలో ఉన్నారని, వారిలో 16 మంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదు. రష్యన్ సైన్యంలో పోరాడుతూ.. 12 మంది భారతీయులు మరణించారని జైస్వాల్ చెప్పారు.
Read Also: Sharon Raj murder case: “ప్రేమ..మోసం..ద్రోహం” సంచలన హత్య కేసులో దోషిగా ప్రియురాలు, ఆమె మామ..
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పోరాడుతూ, ఇటీవల కేరళకు చెందిన వ్యక్తి మరణించగా, మరొకరు గాయపడిన తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రకటన వచ్చింది. కేరళకు చెందిన బినిల్ బాబు ఇటీవల రష్యాలో మరణించాడు. అతడి మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గాయపడిన వ్యక్తి జైన్ టీకే మాస్కోలో చికిత్స పొందుతున్నారు. అతడు చికిత్స పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడని తెలుస్తోంది.