Wrestlers Protest: వందలాది మంది జూనియర్ రెజ్లర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. తమ కెరీర్‌లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయామని రెజ్లర్లు నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఈ సారి మాత్రం వారంతా ప్రముఖ రెజ్లర్లు అయిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లకు వ్యతిరేకంగా గళం విప్పారు. వారికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో రెజ్లింగ్ సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.
బుధవారం వందలాది మంది రెజ్లర్లు ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి జంతర్ మంతర్ చేరుకున్నారు. వీరిలో దాదాపు 300 మంది ఛఫ్రౌలీ, బాగ్‌పట్ లోని ఆర్యసమాజ్ అఖారా నుంచి వచ్చారు. మరికొందరు నరేలాలోని వీరేందర్ సింగ్ రెజ్లింగ్ అకాడమీ నుంచి వచ్చారు. హఠాత్తుగా ఇంత మంది రావడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు కష్టపడ్డారు. వీరంతా సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం సస్పెండ్ చేసిన డబ్ల్యూఎఫ్ఐని పునరుద్ధరించాలని జూనియర్ రెజ్లర్ల కోరారు.
కేంద్రానికి, రెజ్లింగ్ ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా సాక్షి, బజరంగ్, వినేష్ గళం విప్పిన ఇదే చోట ప్రస్తుతం వారు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గతేడాది నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ముగ్గురు ఏస్ రెజ్లర్లు ఆందోళన నిర్వహించారు. బ్రిజ్ భూషణ్‌ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఇటీవల బ్రిజ్ భూషన్ స్థానంలో ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో గెలుపొంది, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలను కూడా ముగ్గురు రెజ్లర్లు తప్పుపట్టారు. బజరంగ్ పూనియా తనకు ఇచ్చి పద్మ శ్రీని కేంద్రానికి వాపస్ ఇస్తానని ప్రకటించడంతో పాటు సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ కార్యవర్గన్నా సస్పెండ్ చేసింది. నిబంధనలు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని చెబుతూ సస్పెన్షన్ విధించింది. ఇండియన్ ఒలింపిక్స్ ఆర్గనైజేషన్‌కి రెజ్లింగ్ బాధ్యతలు నిర్వహించాలని కోరింది.