దళపతి విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు, విశాల్, శివ కార్తికేయన్ లాంటి తమిళ స్టార్ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తల అజిత్ కూడా అప్పుడప్పుడు తన సినిమాలని డబ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. ఈ స్టార్స్ కన్నా దశాబ్దాల ముందే తెలుగులో స్ట్రెయిట్ హీరో రేంజ్ హిట్స్ అందుకున్నారు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరినీ తమిళ హీరోలుగా తెలుగు ఆడియన్స్ ఏ రోజు అనుకోలేదు. అంతగా మన ఆడియన్స్ కి దగ్గరైన ఈ స్టార్ హీరోల నుంచి సినిమా వస్తుంది అంటే ఈ రోజుకీ స్ట్రెయిట్ సినిమా అనే ఫీలింగ్ లోనే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తారు. ఇటీవలే కమల్ నుంచి వచ్చిన విక్రమ్ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ కన్నా రజినీకాంత్ కి తెలుగులో ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. ఆ రేంజ్ ఫాన్ బేస్ ని మూడు దశాబ్దాలుగా తెలుగులో మైంటైన్ చేస్తూనే ఉన్న రజినీకాంత్, ఈసారి మాతరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ విషయంలో తెలుగుని పూర్తిగా లైట్ తీసుకున్నట్లు ఉన్నాడు.
రజిని ప్రస్తుతం నెల్సన్ తో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్స్ లోకి రావడానికి రెడీగా ఉంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి ఇతర ఇండస్ట్రీ స్టార్ హీరోలు కూడా జైలర్ సినిమాలో నటించారు. ముగ్గురు సౌత్ సూపర్ స్టార్ హీరోలు నటించిన జైలర్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం తమిళ్ లో మాత్రమే జరుగుతున్నాయి. తమిళ్ భాషలోని సాంగ్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. జైలర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయ్యింది కానీ ప్రమోషన్స్ మాత్రం ఒక్క భాషలోనే ఎందుకు చేస్తున్నారో మేకర్స్ కే తెలియాలి. మరో రెండు వారాల్లోనే జైలర్ సినిమా రిలీజ్ ఉంది, సాంగ్స్ తెలుగులోకి డబ్ చేసి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేయాలి. ఇంకా లేట్ చేస్తే తెలుగులో కనీసం చెప్పుకునే స్థాయి థియేటర్స్ కూడా దొరికే పరిస్థితి కనిపించట్లేదు. పైగా ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. చిరు ముందు థియేటర్స్ సొంతం చేసుకోవడం జైలర్ కి కాస్త కష్టమైన పనే.