బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ తల్లి నిర్మాత గా మారుతోంది. తన కూతురు కెరీర్ ను గాడిలో పెట్టడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కొందరు కథానాయికలు నిర్మాతలుగా మారారు. అవికా గోర్ తాను నటిస్తున్న దాదాపు అన్ని చిత్రాలకూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇక రాజ్ కందుకూరి తనయుడు శివ నటిస్తున్న ‘మను చరిత్ర’ చిత్రానికి కాజల్ సమర్పకురాలిగా ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మేఘా ఆకాశ్ కూ బహుశా కాజలే స్ఫూర్తి కావచ్చు. అయితే తాను కాకుండా మదర్ బిందును ముందు పెట్టింది మేఘా.
ఇటీవల ఈ అమ్మడు ‘డియర్ మేఘా’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, నటిగా మేఘా ఆకాశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి కథను అందిస్తున్న సినిమాకు బిందు ఆకాశ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటించే ఈ మూవీకి సుశాంత్ రెడ్డి శిష్యుడు అభిమన్యు బడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది.