ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్ లు నిర్వహించి, సినిమాను ప్రమోట్ చేసిన ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ చిత్రబృందం ఇప్పుడు తమ దృష్టినంతా తెలుగుపై పెట్టింది. తెలుగులోనూ ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ రిలీజ్ గురించి ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం ఆ తరువాత అక్కడే ప్రెస్ మీట్ ను నిర్వహించింది.
Read Also : KGF 2 : బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా ? యష్ ఏమన్నాడంటే?
ఈ కార్యక్రమంలో తన తొలి తెలుగు స్ట్రెయిట్ మూవీ ఎప్పుడు ఉంటుంది ? అనే ప్రశ్నకు యష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. త్వరలోనే చేద్దామని అన్నారు. ఇక మల్టీస్టారర్ చేసే ఆలోచన ఉందా ? అనే ప్రశ్నకు సమాధానంగా “మల్టీస్టారర్ అంటే దానికి తగ్గ కథ, దర్శకుడు, టెక్నీషియన్లు ఉండాలి… ముఖ్యంగా ఊర మాస్ కథ ఉండాలి” అని యష్ అన్నారు. ఊర మాస్ అంటే ఓన్లీ యాక్షన్ జోనర్లోనే సినిమాలు చేస్తారా? అని ఓ విలేఖరి యష్ ను ప్రశ్నించారు. “మాస్ లోనూ క్లాస్ ఉంటుంది… కానీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలి. మూవీ మిర్చిలా ఉండాలి. ఆలా ఉంటేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. నేనెప్పుడూ అలాంటి సినిమాలు చేయడానికే ఇష్టపడతాను” అని అన్నారు.