ఒక హీరోయిన్‌కి ఒకట్రెండు ఫ్లాపులు పడ్డాయంటే చాలు, ఆమెకు ఆఫర్లు మెల్లగా తగ్గుతూ వస్తాయి. ఆమె ఫ్లాప్ సెంటిమెంట్ ఎక్కడ తమ సినిమాలపై ప్రభావం చూపుతుందోనన్న ఉద్దేశంతో, తమ సినిమాల్లో తీసుకోవాలా? వద్దా? అని మేకర్స్ కాస్త జంకుతారు. కానీ, పూజా హెగ్డేకి మూడు ఫ్లాపులు వచ్చినా, ఆమెకు ఇంకా క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మార్కెట్‌లో ఆమెకున్న డిమాండ్ అలాంటిది. ఈమె కెరీర్‌లో సక్సెస్ శాతం ఎక్కువగా ఉండడం, ఇండస్ట్రీలో క్రేజ్ కూడా విస్తృతంగా ఉండడంతో.. తమ చిత్రాల్లో తీసుకోవడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే పూజాకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన యశ్.. తన తదుపరి సినిమా దర్శకుడు నర్తన్‌తో చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి.. వీరి కాంబోలో సినిమా గతేడాదిలోనే సెట్స్ మీదకి వెళ్లాల్సింది. కానీ, కేజీఎఫ్2 వాయిదా పడుతూ వస్తుండడంతో కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇది కూడా పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందుతోందని తెలిసింది. అందుకే, కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట! పూజాకి పాన్ ఇండియా క్రేజ్ ఉండడం వల్లే, ఆమెనే తమ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట!
ఆల్రెడీ పూజాతో మేకర్స్ సంప్రదింపులు జరిపారని, ఆమె సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. ఆమె దాదాపు ఓకే చెప్పేందుకే మొగ్గు చూపుతోందని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే, యశ్‌తో తొలిసారి పూజా హెగ్డే వెండితెర పంచుకోనుంది. ఇకపోతే, ఈ సినిమా సైతం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గానే రూపొందుతోందట! త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై అధికార ప్రకటన రానుందని ప్రచారం జరుగుతోంది.