నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం ‘పెద్ద కందుకూరు మెట్ట’ నేషనల్ హైవే పైన ఈరోజు తెల్లవారుజామున రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ రచయిత మరియు డైరెక్టర్ రాజసింహ తడినాడకి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతుండగా ‘మహింద్రా బొలెరో’ వాహనాన్ని తప్పించబోయి రాజసింహ, ఎదురెదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజసింహ ఎడమ కాలు విరిగడంతో పాటు శరీరానికి పలు గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ ఎస్సై నర్సింలు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన రాజసింహను ‘108 వాహనం’లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ వైద్యులు ప్రధమ చికిత్స చేసిన అనంతరం, రాజసింహని మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.
రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ తో ఎండార్స్మెంట్స్ కూడా చేసిన రాజసింహ, ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి పేరొచ్చింది. ఈ క్రేజ్ తో దర్శకుడిగా మారిన రాజసింహ తడినాడ, సందీప్ కిషన్ తో ‘ఒక అమ్మాయి తప్ప’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం మానేసాడు.