తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి! పింగళి వారి రచనలో జాలువారిన పదాలను పరిశీలించి చూస్తే, వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తూ ఉంటుంది. ఆపైన మనల్ని చిత్తు చేసే గుణమూ కనిపిస్తుంది. చూడటానికి మనకు బాగా తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు గమ్మత్తు చేసి చిత్తు చేస్తుంది
పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29న బొబ్బిలి సమీపంలోని రాజాంలో జన్మించారు. వారి బంధువులంతా మచిలీపట్నంలో ఉండడంతో పింగళివారి కుటుంబం కూడా బందరు చేరుకుంది. బాల్యం నుంచీ బాగా చదివే అలవాటు ఉండేది. ఏ కొత్త పదం కనిపించినా, ఎంతో ఆసక్తిగా దానిపై పరిశోధన చేసేవారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివిన పింగళి తరువాత స్వరాజ్య పోరాటానికి ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో ‘జన్మభూమి’ అనే రచన చేశారు. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న కారణంగా జైలు జీవితం కూడా గడిపారు. కొద్ది రోజులు ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత బెంగాల్ నాగపూర్ రైల్వేస్ లో ఉద్యోగం చేశారు. తరువాత మచిలీ పట్నం వచ్చి, ‘వింధ్యరాణి’ అనే నాటకం రాశారు. అది మంచి పేరు సంపాదించి పెట్టింది. రచయితగా పింగళి మంచి పేరు సంపాదించిన రోజులలోనే ఆయనకు సినిమా రంగంలో అడుగు పెట్టే అవకాశం కలిగింది.
‘శ్రీకృష్ణ లీలలు’తో సంభాషణలు రాస్తూ వచ్చారు. తరువాత “భలే పెళ్ళి, వింధ్యరాణి, గుణసుందరి కథ” చిత్రాలకు పాటలు, మాటలు రాస్తూ సాగారు. విజయావారి తొలి జానపదం ‘పాతాళభైరవి’లో పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. అందులో ఆయన పలికించిన “నిజం చెప్పమన్నారా…అబద్ధం చెప్పమన్నారా…” అన్న మాటలు, “తప్పు తప్పు…” అనే ఊతపదాలు, “డింగరీ, బుల్ బుల్…”అనే పదాలు జనాన్ని కట్టిపడేశాయి. విజయా సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు పింగళి వారి రచన దన్నుగా నిలచింది. ఘనవిజయాలను సాధించి పెట్టింది.
ప్రాచీన భాషాప్రవీణుల ప్రయోగాల ప్రకారం ఓ పదాన్ని తిప్పి వేస్తే దానికి వ్యతిరేకం వస్తుందని అంటారు. అలాంటి పదాలనూ పలికించి వినోదం పంచారు. ‘మిస్సమ్మ’ లోని “బృందావనమది అందరిదీ…” పాటలో “‘ఈసునసూయలు’ అన్న పదం వేశారు. చాలామంది దానిని “ఈ సునసూయలు…’ గా భావించారు. నిజానికి “ఈసు, అసూయ” అన్న పదాలను కలిపి “న”కారాదేశంతో “ఈసునసూయలు” అన్న సమాసం చేశారు పింగళి. భూతాల భాష ఎలా ఉంటుందో కూడా ‘జగదేకవీరుని కథ’ లో పలికించారు. ఇక పదాలను సంక్షిప్తీకరించడం (Abbreviation)లోనూ ఆయనది అందెవేసిన చేయే.
‘శ్రీకృష్ణార్జున యుద్దం’ లో తీర్థయాత్రలు చేస్తూ స్వాముల వారి వేషంలో ద్వారకలో ప్రవేశిస్తాడు అర్జునుడు. అప్పుడు అతనికి ఓ పేరు కావాలి కదా! అందుకు అర్జునుని వెంట వచ్చిన సన్యాసి ఆయనకున్న దశ నామాలను సంక్షిప్తం చేసి “అజిబీ ధఫపా విశ్వేశకి స్వామి” అని పేరు పెట్టారు. తరువాతి రోజుల్లో “పా.కో.కు.” అంటే “పాకెక్కి కోడిలా కూస్తా…” అన్న జంధ్యాల ప్రయోగానికి ఇదే స్ఫూర్తిగా నిలచింది. ఇక కొత్త పదాలను కనిపెట్టడంలోనూ దిట్ట ఆయన. అందుకు వ్యాకరణం అనుమతించదని తెలిసే కాబోలు “ఎవరూ కనిపెట్టకుండా కొత్త పదాలుఎలా పుడతాయ్…” అంటూ ‘మాయాబజార్’ లో ఘటోత్కచునితో చెప్పించారు.
“ఎకిమీడా…” అన్న పదం ఆ మధ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక చిత్రంలో వినిపించగానే ఈ కాలం పిల్లలు ఆహా ఓహో అంటూ పాత పదాన్ని పసందుగా పలికించారని రచయితపై అభినందన జల్లులు కురిపించారు. ‘రాజకోట రహస్యం’ లోనే పింగళి… “ఘన నాట్యము…ఆడే ఎద తూలేవోయ్ ఎకిమీడా…” అంటూ పలికించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పింగళి తన దరికి చేరిన ప్రతి అవకాశంలోనూ తనదైన బాణీ పలికించాలనే ప్రయత్నించారు. అలాగే సఫలీకృతులయ్యారు. పింగళి రచనలో జాలువారిన మాటలు, పాటలు వింటే ఆయన పాండిత్యంలోని మాధుర్యం మనకు మహదానందం కలిగిస్తుంది. భావి రచయితలకు పింగళి రచనతో రూపొందిన చిత్రాలే అధ్యయనాలు. అలా అనడానికి, ఆయనను అనుసరించి ఈ తరంలో ‘మాటల మాంత్రికులు’ అనిపించుకుంటున్నవారే నిదర్శనం. అంతలా జనాన్ని అలరించిన పింగళి 1971 మే 6న తనువు చాలించారు. ఆయన మాటలు మాత్రం మనకు కితకితలు పెడుతూనే ఉండడం విశేషం!