ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ సంస్థ తమ శతసంవత్సరం సందర్భంగా ‘విష్’ అనే యానిమేటెడ్ మూవీని రూపొందించింది. ‘విష్’ టీజర్ ను గురువారం విడుదల చేయగా, ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ సాగుతోంది. ఈ టీజర్ లో ఆశ తన గొర్రెపిల్లతో కలసి అడవిలోకి వెళ్ళడం, అక్కడ ఆకాశంలోని ఓ తారను చూసి మనసులో ఓ కోరిక కోరుకోవడం కనిపిస్తుంది. తన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, దుష్టుడైన రాజు కబంద హస్తాల నుండి వారిని రక్షించమని ఆశ కోరుకుంటుంది. ఆ తార నుండి ఓ డాన్స్ చేసే కాంతి పుంజం వస్తుంది. ఆ మ్యాజికల్ స్టార్ ఆశ, గొర్రెపిల్లను వెంబడిస్తుంది. ఆశ్చర్యంగా ఆ గొర్రెపిల్లకు మాటలు వస్తాయి. ఆ తరువాత ఏమయిందో తెలియాలంటే నవంబర్ 22 దాకా ఆగాలి. ఎందుకంటే ‘విష్’ యానిమేటెడ్ మూవీ థియేటర్లలో నవంబర్ 22న సందడి చేయనుంది.
Read Also: Marvel Cinematic Universe: సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 నుంచి ఫస్ట్ సీరీస్…
ఈ యేడాది జనవరి 23న డిస్నీ సంస్థ తమ శతవార్షిక ఉత్సవం ఆరంభించింది. ఈ సందర్భంగానే బాలలను ఆకట్టుకొనే తీరున ‘విష్’ను డిస్నీ సంస్థ తెరకెక్కించింది. మనసులోని కోరికలు నెరవేరే ప్రాంతంలో ఆశ జీవిస్తూ ఉంటుంది. అక్కడ ఆశ, ఆమె గొర్రెపిల్ల చేసే సందడి బాలలను అలరిస్తుందని చెప్పవచ్చు. అకాడమీ అవార్డ్ విన్నర్ అరియానా డిబోస్ ఆశ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ‘విష్’టీజర్ ను చూసిన పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఆశిస్తున్నారు. నవంబర్ 22న ‘విష్’ ఏ తీరున మెప్పిస్తుందో చూద్దాం.