ప్రతిభకు పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. సినిమా రంగంలో మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ ఒకడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ అలరిస్తున్నాయి. విజయ్ కి తెలుగు సినిమా రంగంతో సంబంధం లేదని చెప్పలేం. ఎందుకంటే విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తెలుగు చిత్రసీమలో దర్శకునిగా సాగారు. చిరంజీవి హీరోగా చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు’ వంటి సినిమాలు రూపొంది అలరించాయి. ప్రస్తుతం విజయ్ అనువాద చిత్రాలకు తెలుగునాట మంచి మార్కెట్ ఉంది. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న మద్రాసులో జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ పేరున్న దర్శకుడు. తల్లి శోభాచంద్రశేఖర్ రచయిత్రి. ఆమె
కథతోనే ‘చట్టానికి కళ్ళులేవు’ సినిమా తెరకెక్కింది. విజయ్ బాల్యం నుంచే చురుగ్గా ఉండేవాడు.
ఏకసంధాగ్రాహి. ఆ చురుకుదనాన్ని చూసి తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తాను తెరకెక్కించిన ‘వెట్రి, కుడుంబం, వసంతరాగం, సట్టం ఒరు విలయాట్టు, ఇదు ఎంగల్ నీతి, నాన్ సిగప్పు మనిదన్’ వంటి చిత్రాలలో విజయ్ ని బాలనటునిగా నటింప చేశారు. ఆ సినిమాలతోనే విజయ్ బాలనటుడుగా చక్కటి పేరు సంపాదించాడు. దాంతో చంద్రశేఖర్, శోభ దంపతులు తమ తనయుడు విజయ్ ని హీరోగా చూడాలని తపించారు. అందుకోసం శోభ కథను తయారు చేసి, నిర్మాతగా మారితే, తండ్రి చంద్రశేఖర్ మెగాఫోన్ పట్టి ‘నాలై తీర్పు’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా విజయ్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘రసిగన్’లో మరోసారి తండ్రి దర్శకత్వంలో నటించిన విజయ్ కి విమర్శకుల ప్రశంసలు లభించకున్నా కమర్షియల్ సక్సెస్ దరి చేరింది. విక్రమన్ దర్శకత్వం వహించిన ‘పూవే ఉనక్కాగ’ సినిమాతో నటునిగానూ, హీరోగానూ మంచి మార్కులు సంపాదించిన విజయ్ ఆపై వెనుదిరిగి చూసుకోలేదు. బాలశేఖరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ టుడే’తో మరో ఘన విజయం విజయ్ సొంతమయింది. ఇదే చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’గా రూపొందటం విశేషం. ఆ తరువాత విజయ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగారు. ఆరంభంలో విజయ్, అజిత్ కలసి నటించారు. తరువాత వారిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ మొదలయింది.
ఎమ్జీఆర్ – శివాజీ గణేశన్, రజనీకాంత్ – కమల్ హాసన్ తరువాత బాక్సాఫీస్ వద్ద విజయ్ – అజిత్ జోడీకే మంచి పోటీ ఉందని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగా విజయ్ -అజిత్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ సాగుతూ ఉంటుంది. విజయ్ తమిళంలో నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో రీమేక్ అయి, ఇక్కడా హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఒకటి. ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన మహేశ్ ‘ఒక్కడు’ తమిళంలో విజయ్ తో ‘గిల్లీ’గా, ‘పోకిరి’ విజయ్ తో ‘పోక్కిరి’గా తెరకెక్కి అనూహ్య విజయం సాధించాయి. దాంతో విజయ్ స్టార్ స్టేటస్ మరింత పెరిగింది. ‘ఇలయ దళపతి’గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించిన విజయ్ తమిళ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలడని కొన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఆయన తండ్రి చంద్రశేఖర్ విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించినా దానిని కొట్టిపడేస్తూ ప్రస్తుతానికి నటనలోనే కొనసాగుతానని ఆ మధ్య చెప్పాడు. ఇక ‘వారసుడు’ చిత్రం కోసం హైదరాబాద్ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుసుకోవడం పలు చర్చలకు దారితీసింది.
నిజానికి పలు రాజకీయ పార్టీలు విజయ్ ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశాయి. ప్రభుత్వాలపై విజయ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తన సినిమాల్లోనూ వదలకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇటీవల స్టూడెంట్స్ స్కాలర్ షిఫ్ ప్రోగ్రామ్ లో పాల్గొని ఆ విమర్శలకు మరింత పదను పెట్టాడు. దాంతో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోందని వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ నటించిన ‘లియో’ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈ సినిమాలో విజయ్ ఎలాంటి పొలిటికల్ సెటైర్స్వే యబోతున్నాడు? రాబోయే కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా! వస్తే పొలిటికల్ లీడర్ గా రాణిస్తాడా? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.