ఆస్కార్స్ 2022 వేదికపై జరిగిన విల్ – రాక్ సంఘటన షాకింగ్ నిర్ణయానికి దారి తీసింది. విల్ స్మిత్ ను అకాడమీ అవార్డుల నుండి పదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అకాడమీ నిర్ణయాన్ని విల్ స్మిత్ కూడా గౌరవించారు. అకాడమీ తమ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత విల్ స్మిత్ స్పందిస్తూ “నేను అకాడమీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను, గౌరవిస్తాను” అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ” 2022 ఏప్రిల్ 8 నుండి 10 సంవత్సరాల పాటు మిస్టర్ స్మిత్ ను అకాడమీ అవార్డులకు మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా ఎటువంటి అకాడమీ ఈవెంట్‌లు లేదా ప్రోగ్రామ్‌లకు హాజరు కావడానికి అనుమతించరాదని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్ణయించారు” అని అకాడమీ శుక్రవారం తెలిపింది. అయితే ఈ 53 ఏళ్ల నటుడు “కింగ్ రిచర్డ్”లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఈ ఏడాది సంపాదించుకున్న ఆస్కార్‌ను మాత్రం విల్ కే ఇచ్చేసింది అకాడమీ.
Read Also : Will Smith : చెంప దెబ్బ ఎఫెక్ట్ గట్టిగానే… హీరోపై అకాడమీ షాకింగ్ నిర్ణయం
మార్చి 27న హాస్యనటుడు క్రిస్ రాక్ ఆస్కార్ అవార్డుల వేదికపై విల్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండుపై జోక్ చేయడంతో ఎమోషనల్ గా హర్ట్ అయ్యి, అతని చెంప చెళ్లుమన్పించాడు. జాడా జుట్టు రాలడానికి కారణమయ్యే అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతోంది. అయితే ఆ తరువాత స్మిత్ తన ఆస్కార్‌ను అందుకున్నాడు. అవార్డుల వేడుక అనంతరం రాక్‌కి క్షమాపణ కూడా చెప్పాడు. మరోవైపు రాక్ పరిస్థితిపై ఇంకా స్పందించలేదు.