Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఐదు దశాబ్దాల పాటు నటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రను వేసిన నటుడు. అంతేకాదు… నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన వ్యక్తి. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ ఆయన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన మరణవార్త తెలియగానే రెండు తెలుగు రాష్ట్రాలలోని అభిమానులు జేబులో డబ్బులు ఖర్చుపెట్టుకుని తమ అభిమాన నటుడిని కడసారి చూడటానికి హైదరాబాద్ కు తండోప తండాలుగా వచ్చారు. కానీ ఆయన సినిమాలతో సక్సెస్ తో పాటు పాపులారిటీని సంపాదించుకున్న పరాయి రాష్ట్రాల సినీ ప్రముఖులు మాత్రం ముఖం చాటేశారు.
కృష్ణకు తమిళ చిత్రసీమతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు! ఆయన సినీ రంగ ప్రస్థానంలో చెన్నయ్ లోనే మొదలైంది. తమిళ చిత్రసీమలోని మహామహులతో కృష్ణకు గాఢానుబంధం ఉంది. తమిళంలో కృష్ణ పలు చిత్రాలు నిర్మించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన కృష్ణంరాజు ‘శివమెత్తిన సత్యం’ను శివాజీ గణేశన్ తో ‘విశ్వరూపం’ పేరుతో పునర్ నిర్మించారు. కన్నడ చిత్రం ‘అంత’ను శివాజీ గణేశన్ తోనే ‘త్యాగి’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. రజనీకాంత్ హీరోగా ‘మావీరన్’ మూవీని తీశారు. శివాజీ గణేశన్ కృష్ణతో పాటు తెలుగులో ‘నివురు గప్పిన నిప్పు, బెజవాడ బెబ్బులి, విశ్వనాథ నాయకుడు’ సినిమాలలో నటించారు. శివాజీ గణేశన్ కొడుకు ప్రభు ఇప్పుడు పలు తెలుగు చిత్రాలలో నటిస్తున్నారు. తన తండ్రితో కృష్ణకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అయినా ప్రభు హైదరాబాద్ వచ్చి ఉండాల్సింది. కానీ రాలేదు. రజనీకాంత్ కూడా కృష్ణతో ‘రామ్ రాబర్ట్ రహీమ్’, ‘అన్నదమ్ముల సవాల్’, ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రాలలో నటించారు. ఆయన కూడా చివరి చూపు కోసం భాగ్యనగరానికి రాలేదు. కేవలం సందేశం పంపి ఊరుకున్నారు. కృష్ణ సరసన నటి సుహాసిని పలు చిత్రాలలో నాయికగా నటించారు. కొద్ది రోజుల క్రితం తన భర్త మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమెకు ఇప్పుడు కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి సమయం చిక్కలేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు కాగా, బాలీవుడ్ తారల తీరు మరో ఎత్తు. హిందీ చిత్రసీమతో కృష్ణకు గాఢానుబంధం ఉంది. హీరో జితేంద్ర టైమ్ అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఇక్కడి సినిమాలను హిందీలో రీమేక్ చేసి, జితేంద్ర కెరీర్ ను మరోసారి పైకి లేపారు కృష్ణ. తాను, ఎన్టీయార్ కలిసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని హిందీలో ‘టక్కర్’ పేరుతో సంజీవ్ కుమార్, జితేంద్రతో నిర్మించారాయన. అలానే కన్నడ ‘అంత’ సినిమాను జితేంద్రతో హిందీలో ‘మేరీ ఆవాజ్ సునో’గా తీశారు. దాని విడుదలకు కృష్ణ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. కోర్టు నుండి అనుమతి తెప్పించుకుని మూవీని రిలీజ్ చేశారు. ఇక తన ‘ఊరికి మొనగాడు’ను హిందీలో జితేంద్రతోనే ‘హిమ్మత్ వాలా’గా తీసి, ఘన విజయాన్ని అతని ఖాతాలో వేశారు. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ను ‘మవాలి’గా, చిరంజీవి ‘ఖైదీ’, ఎన్టీయార్ ‘జస్టిస్ చౌదరి’ చిత్రాలను జితేంద్రతో హిందీలో అవే పేర్లతో రీమేక్ చేశారు. ‘శక్తి’ని ‘కామ్ యాబ్ ‘పేరుతోనూ, ‘కిరాయి రౌడీలు’ను ‘హోషియార్’ గానూ జితేంద్రతో నిర్మించారు. తాను ఇక్కడ ‘సింహాసనం’ మూవీలో నటిస్తే, హిందీ వర్షన్ లో జితేంద్రను పెట్టి తీశారు. తన ‘ముద్దాయి’ని ‘ముజ్రీమ్’ పేరుతోనూ, రాజశేఖర్ నటించిన ‘ఆహుతి’ చిత్రాన్ని ‘కన్వర్ లాల్’గానూ జితేంద్రతో రీమేక్ చేశారు. జితేంద్ర సెకండ్ ఇన్నింగ్స్ కూ దన్నుగా నిలిచిన కృష్ణ ను కడసారి చూడటానికి కూడా జితేంద్ర రాకపోవడం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవేళ జితేంద్ర వయోభారంతో హైదరాబాద్ కు రాలేకపోయారని అనుకున్నా, ఆయన కూతురు ఏక్తా కపూర్ లేదా కొడుకు తుషార్ కపూర్ అయిన వచ్చి ఉండాల్సింది. ఎందుకంటే తుషార్ కపూర్ తో కూడా కృష్ణ హిందీలో సినిమాను నిర్మించారు. తెలుగు ‘స్వయంవరం’ మూవీని హిందీలో ‘క్యా దిల్ నే కహా’గా తుషార్ కపూర్, ఈషా డియోల్ తో రీమేక్ చేశారు. ఇక కృష్ణ హిందీలో నిర్మించిన సినిమాలలో నటించిన వారిలో డినో మోరియో, బిపాసా బసు, గోవింద్, టబు, ఇషా కొప్పికర్, జుహీ చావ్లా తదితరులు ఉన్నారు.
అలానే శ్రీదేవి బాలీవుడ్ లో స్థిరపడటానికి కూడా కృష్ణ నిర్మించిన హిందీ సినిమాలే కారణం. ఆమె నటించిన ‘పదహారేళ్ల వయసు’ సినిమా ఉత్తరాదిలో పరాజయం పాలైన సమయంలోనే ‘హిమ్మత్ వాలా’లో శ్రీదేవిని నాయికగా పెట్టి మూవీ నిర్మించారు కృష్ణ. అలానే ‘జస్టిస్ చౌదరి, మవాలి’ వంటి సినిమాలతో ఆమెకు గట్టి పునాది పడేలా చేశారు. తెలుగులోనూ శ్రీదేవికి కృష్ణ ఎంతో లిఫ్ట్ ఇచ్చారు. చనిపోయిన తన భార్యకు కృష్ణతోనూ, పద్మాలయ సంస్థ తోనూ ఉన్న అనుబంధాన్ని గుర్తించి అయినా శ్రీదేవి భర్త బోనీకపూర్ హైదరాబాద్ వచ్చి కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించాల్సింది. కానీ ఆయన కూడా ముఖం చాటేశారు. తన కుమార్తె జాన్వీ కపూర్ హిందీ సినిమా ‘మిలీ’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు ఆగమేఘాల మీద రావడానికి ఆయనకు కుదిరింది కానీ కృష్ణను కడసారి చూడటానికి వీలు కాలేదు! పరాయి రాష్ట్ర సినీ ప్రముఖుల మీద మనవాళ్ళు చూపించే ప్రేమాభిమానులను వారు మన వారి మీద చూపకపోవడం ఎవరికైనా బాధను కలిగిస్తుంది. మల్లెపువ్వులాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న కృష్ణ విషయంలో వారు అలా ప్రవర్తించడం ఆ బాధను రెట్టింపు చేయడం సహజం!