బిగ్ బాస్ సీజన్ 6 గతంలో మాదిరిగానే అవాకులు, చెవాకులు; విమర్శలు, ప్రతి విమర్శలతో సాగుతోంది. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి పెద్దన్న పాత్ర పోషిస్తున్న బాలాదిత్య గేమ్ లో గెలిచి, కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అతనికి గీతు రాయల్ గట్టిపోటీ ఇచ్చినా ఆమె ఆట అన్ ఫెయిర్ గా ఉందంటూ న్యాయనిర్ణేత ఫైమా దానిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో… విజయం బాలాదిత్యకు దక్కింది.
ఈవారం వరెస్ట్ ఇంటి సభ్యులను ఎంచుకునే క్రమంలో ఎప్పటిలానే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు రేవంత్ ను టార్గెట్ చేసిన మెజారిటీ సభ్యులు ఇప్పుడు గీతు వైపు టర్న్ తీసుకున్నారు. ఆమె మాట తీరు, ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందని, తనను తాను మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది ఎక్కువ మంది చేసిన ఆరోపణ. అయితే వాళ్ళకు తనదైన స్టైల్ లో గీతు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక్కడకొచ్చి ఓ మూడు నెలలు కలిసి ఉన్నంత మాత్రాన కంటెస్టెంట్స్ ను తన కుటుంబ సభ్యులుగా భావించలేనని తేల్చిచెప్పేసింది. ఇక వరెస్ట్ కంటెస్టెంట్ గా అత్యధిక నామినేషన్స్ అందుకున్న గీతును బిగ్ బాస్ ఆదేశాల మేరకు గార్డెన్ ఏరియాలోని జైలుకు పంపారు. ఎప్పటిలానే బిగ్ బాస్ ఈసారి కూడా కొన్ని రూల్స్ పాటించడంలో స్ట్రిక్ట్ గానే వ్యవహరించాడు. రేవంత్ తనను తాను వరెస్ట్ కంటెస్టెంట్ గా మేన్షన్ చేసుకున్నప్పుడు బిగ్ బాస్ అంగీకరించలేదు. అలానే గీతును జైలులో పెట్టకుండా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని కెప్టెన్ స్థానంలో ఉన్న బాలాదిత్య కోరినప్పుడు కూడా బిగ్ బాస్ ఆ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేయలేదు. మొత్తం మీద మొదటివారం కెప్టెన్ గా గెలుపొంది బాలాదిత్య అగ్రస్థానంలో నిలిస్తే వరెస్ట్ పెర్ఫార్మర్ గా గీతు జైలుకు వెళ్ళింది. మొన్న, నిన్న రేవంత్ ను టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు అతన్ని కూడా కలుపుకోవడం మొదలు పెట్టారు. రకరకాల కారణాలతో నామినేషన్స్ లో ఉన్న రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనయా, ఆరోహి, అభినయశ్రీ లలో ఎవరు హౌస్ నుండి మొదటగా బయటకు వస్తారో చూడాలి!