కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాలలో సెప్టెంబర్ లో ‘లవ్ స్టోరీ’ చక్కని కలెక్షన్లను రాబట్టి విజేతగా నిలువగా, అక్టోబర్ మాసంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విజయపథంలో సాగింది. దాంతో అన్నదమ్ములు అక్కినేని నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టినట్టు అయ్యింది. అక్టోబర్ నెల ప్రారంభం రోజునే సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. దానితోనే ‘అసలు ఏం జరిగిందంటే?’, ‘ఇదే మా కథ’, ‘ఆటా నాదే వేటా నాదే’ చిత్రాలు ఫస్ట్ వీకెండ్ లో విడుదలయ్యాయి. శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్, తన్యా హోప్ కీలక పాత్రలు పోషించిన రోడ్ జర్నీ మూవీ ‘ఇదే మా కథ’లో కొత్తదనం ఉన్నా, దాన్ని జనం ఆదరించలేదు.
అక్టోబర్ రెండో శుక్రవారం వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’తో పాటు గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’, ‘నేను లేని నా కథ’, శివ కార్తికేయన్ తమిళ అనువాద చిత్రం ‘వరుణ్ డాక్టర్’ జనం ముందుకు వచ్చాయి. ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి తీసిన సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కావడంతో మెగాభిమానులు ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ వీళ్ళందరి అంచనాలను ‘కొండపొలం’ తల్లకిందులు చేసింది. ఇక ఇదే ఫలితం గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’కూ ఎదురైంది. గోపీచంద్, బి. గోపాల్ ఫస్ట్ కాంబినేషన్ లో ఆరేడేళ్ళ ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా ఏ స్థాయిలోనూ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక అక్టోబర్ మూడో వారాంతంలో శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహా సముద్రం’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘పెళ్ళి సందడి’, అనువాద చిత్రం ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’ విడుదలయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘మహా సముద్రం’ నెగెటివ్ రిజల్డ్ అందుకుంది. అదే సమయంలో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చక్కని ఓపెనింగ్స్ ను సాధించి, విజయపథంలో సాగింది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు గౌరవ ప్రదమైన కలెక్షన్లు దక్కడం విశేషం. ఇక కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్ళిసందడి’ కొత్తదనం లేకపోవడంతో కుర్రకారును అలరించలేకపోయింది.
అక్టోబర్ థర్డ్ వీకెండ్ లో వచ్చిన ‘నాట్యం’, ‘మధుర వైన్స్’, ‘అసలేం జరిగింది’, ‘క్లిక్’, ‘ప్యార్ హీ ప్యార్’ చిత్రాలేవీ జనాలను ఆకట్టుకోలేకపోయాయి. అదే వారాంతంలో సునీల్ కీలక పాత్ర పోషించిన ‘హెడ్స్ అండ్ టైల్స్’ ఓటీటీలో విడుదలైంది. కానీ దీనికీ పెద్దంత స్పందన రాలేదు. ఇక ఫోర్త్ వీకెండ్ లో ఏకంగా తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందనే తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ‘వరుడు కావలెను’తో పాటే పూరి తనయుడు ఆకాశ్ ‘రొమాంటిక్’, నవీన్ చంద్ర ‘మిషన్ 2020’, ‘తీరం’, ‘తమసోమా జ్యోతిర్గమయా’, ‘ఓ మధు’, ‘మైల్స్ ఆఫ్ లవ్’ విడుదలయ్యాయి. అలానే అనువాద చిత్రాలు ‘మిస్టర్ ప్రేమికుడు’, ‘జై భజరంగి’ కూడా జనం ముందుకు వచ్చాయి. మొత్తంగా అక్టోబర్ నెలలో 26 సినిమాలు రిలీజ్ కాగా, అందులో 21 స్ట్రయిట్ చిత్రాలు, 5 అనువాద చిత్రాలు. ఓవర్ ఆల్ గా కలెక్షన్ పరంగా చూసినప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మంచి విజయాన్ని సాధించి, అక్టోబర్ విన్నర్ గా నిలిచింది.