అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’. నిజానికి రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ తెలుగు వారి ముందుకు ఈ మూవీతోనే రావాల్సింది. కానీ దీని విడుదల జాప్యం కావడంతో ‘అద్భుతం’ సినిమా ముందు రిలీజైంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన తొలి రెండు సినిమాలూ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. ‘118’ మూవీతో తొలిసారి డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్ కె. వి గుహన్ రూపొందించిన ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ మూవీని తొలి కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా దర్శక నిర్మాతలు గుహన్, డా. రవి ప్రసాదరాజు దాట్ల చెప్పుకుంటున్నారు. ‘ఎవరు? ఎక్కడ? ఎందుకు? అనేది ఈ టైటిల్ ఫుల్ ఫామ్! ఇక కథ విషయానికి వస్తే… విశ్వ (అదిత్ అరుణ్), క్రిస్టీ (దివ్య శ్రీపాద), సదా (సత్యం రాజేశ్), అష్రఫ్ (ప్రియదర్శి) బెస్ట్ ఫ్రెండ్స్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విశ్వ గైడెన్స్ లో నాలుగురూ నాలుగు వేర్వేరు ప్రదేశాలలో ఉండి కలిసి ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. క్రిస్టీ ఫ్లాట్ మేట్ మిత్ర (శివానీ రాజశేఖర్)తో విశ్వకు అయిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఆమె ప్రేమతో పూర్తి గా మారిపోయిన విశ్వ పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రిస్టీ ఫ్లాట్ లోకి చొరబడిన ఓ అగంతకుడు (సందీప్ భరద్వాజ) ఆమెను కత్తితో పొడిచి, మిత్రను బంధిస్తాడు. విశ్వ స్నేహితురాలు, ప్రియురాలిని అతను ఎందుకు టార్గెట్ చేశాడు? విశ్వతో అతనికి ఉన్న వైరం ఏమిటీ? అనేదే ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ మూవీ.
గడిచిన కొన్ని సంవత్సరాలుగా సైబర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అదుపు చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా టెక్నాలజీ మీద గ్రిప్ ఉన్న యంగ్ స్టర్స్ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ టీమ్ కథే ఇది. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అనే పాయింట్ ను దర్శకుడు గుహన్ ఆసక్తికరంగా చూపించాడు. అయితే ప్రథమార్ధంలో హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు కాస్తంత బోర్ కొట్టిస్తాయి. అసలు కథ మొదలైన తర్వాత మూవీ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక క్లయిమాక్స్ ప్రిడిక్టబుల్ గానే ఉంది.
నటీనటుల విషయానికి వస్తే ‘అద్భుతం’లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శివానీ ఇందులోనూ అలానే నటించింది. కథానుగుణంగా ఆమెకు పెద్దంత స్పేస్ లేదు. సినిమా మొత్తం రెండు గదుల్లోనే జరగడంతో పరిమితమైన సన్నివేశాలలోనే ప్రతిభను చూపించాల్సిన పరిస్థితి. ఈ విషయంలో ఇద్దరు తమను తాము గొప్ప నటులుగా ప్రూవ్ చేసుకున్నారు. కొన్నిచోట్ల కాస్తంత అతిగా అనిపించినా, అదిత్ అరుణ్ డిఫరెంట్ ఎమోషన్స్ ను చక్కగా పండించాడు. అలానే ‘వీరప్పన్’ ఫేమ్ సందీప్ భరద్వాజ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించాడు. ఇప్పటి వరకూ గర్ల్ నెక్స్ డోర్ తరహా పాత్రలతో ఆకట్టుకున్న దివ్య శ్రీపాద మేకోవర్ బాగుంది. ప్రియదర్శి, ‘సత్యం’ రాజేశ్, రియాజ్ ఖాన్, వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పటిలానే వైవా హర్ష కాస్తంత వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు.
బేసికల్ గా కథకు కీలకమైన సంఘటనలను సన్నివేశాలుగా చూపకుండా డైలాగ్స్ రూపంలో చెప్పేయడంతో ప్రేక్షకులు అవతలి వ్యక్తి తాలుకు పెయిన్ ను అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి ఇది పెద్ద మైనెస్ పాయింట్. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం ఓ స్థాయిలో సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేసింది. అలానే మిర్చి కిరణ్ మాటలూ ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ ఓవర్ ఆల్ గా చూస్తే… మూవీలో సోల్ మిస్ అయ్యిందనే భావన కలుగుతుంది. బట్… ఓటీటీలోనే ఉంది కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడేవారు ఎప్పుడైనా తీరిక దొరికితే ఓసారి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్నకథ
టెక్నికల్ వాల్యూస్
సెకండ్ హాఫ్
మైనెస్ పాయింట్స్
బోర్ కొట్టే ప్రథమార్థం
ఆకట్టుకోని కథనం
ప్రిడిక్టిబుల్ క్లయిమాక్స్
రేటింగ్: 2.25 /5
ట్యాగ్ లైన్: సైబర్ క్రైమ్!